Perni Answers : ఆర్జీవీ ప్రశ్నలు, పేర్ని సమాధానాలు.. కొడాలి హెచ్చరికలు.!

Perni Answers : సినిమా టిక్కెట్ల వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ సంధించిన పది ప్రశ్నలకు ఓపిగ్గా, సెటైరికల్‌గా పేర్ని నాని సమాధానాలిచ్చేశారు. అంతలోనే, మరో మంత్రి కొడాలి నాని ‘సవాల్’ విసిరేశారు. ‘ప్రభుత్వానికేంటి సంబంధమని ప్రశ్నిస్తున్నారు కదా, దమ్ముంటే టిక్కెట్ల రేట్లు పెంచి అమ్ముకోండి..’ అంటూ కొడాలి నాని విసిరిన సవాల్ ఇప్పుడందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న వ్యక్తులు ఒకింత హుందాతనం ప్రదర్శించాలి. కొడాలి నానిలో ఆ హుందాతనమే కనిపించడంలేదు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందుబాటు ధరకే అందించాలని ప్రభుత్వం భావించడాన్ని తప్పు పట్టలేం. కానీ, నిత్యావసర వస్తువుల ధరల మాటేమిటి.? పండగ వేళ పెంచిన ఆర్టీసీ ఛార్జీల మాటేమిటి.?

ప్రభుత్వం ఒక్కో విషయంలో ఒక్కోలా వ్యవహరించడం ఆశ్చర్యకరమే. పేర్నినాని అంత శాంతంగా రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలకు సమాధానాలైతే ఇచ్చాననుకున్నారుగానీ, అసలు సిసలు ప్రశ్నలకు సమాధానం అయితే దొరకలేదు. జగన్ సర్కారు పాలన ప్రజలకు నచ్చనప్పుడు, అధికారాన్ని వదులుకుంటారా.? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. దానికి ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు, రాదు కూడా.!

ఒక్కటి మాత్రం నిజం.. సినిమా టిక్కెట్ల ధరలు అమాంతం పెంచేయడం సమర్థనీయం కాదు. అదే సమయంలో, సినిమా టిక్కెట్ల ధరల్ని దారుణంగా తగ్గించేయడమూ సమర్థనీయం కాదు.

సినిమా టిక్కెట్ల ధరలు అటు నిర్మాతలకీ, ఇటు ప్రేక్షకులకీ మేలు చేసేలా వుండాలి. కేవలం ప్రేక్షకులకే మేలు చేసేలా సినిమా టిక్కెట్ల ధరలుంటే, తెలుగు సినిమా స్థాయి పెరగదు. డబ్బింగ్ సినిమాలతోనో, చిన్న సినిమాలతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వస్తుంది.