అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారవుతుంది రేవంత్ రెడ్డి విషయంలో ప్రతిసారీ. తెలుగుదేశం పార్టీలోనూ రేవంత్ రెడ్డి చాలా యక్టివ్‌గా వుండేవారు. అప్పట్లో ఆయన్ని తొక్కేసేందుకు చాలామంది టీడీపీ సీనియర్ నేతలు ప్రయత్నించారు. అలా తొక్కేందుకు ప్రయత్నించినవారంతా, కాలగమనంలో.. టీడీపీని వీడారు. చివరికి రేవంత్ రెడ్డి కూడా టీడీపీని వీడక తప్పలేదు. టీడీపీని వీడే క్రమంలో చంద్రబాబు మీద తనకున్న అమితమైన అభిమానాన్ని రేవంత్ చాటుకున్నారు.
చంద్రబాబు సూచనతోనే రేవంత్, కాంగ్రెస్ పార్టీలో చేరారన్న ప్రచారమూ లేకపోలేదు. అది వేరే సంగతి. కాంగ్రెస్ పార్టీలో చేరాక అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్, అనూహ్యంగా లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. అప్పట్లో అదో సంచలనం. ఏం లాభం.? కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన గౌరవం దక్కడంలేదు.
పార్టీ పరంగా పదవులైతే దక్కుతున్నాయిగానీ, వెన్నపోట్లు ఎక్కువైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రేవంత్ రెడ్డి వెళ్ళలేరు. బీజేపీ వైపుకూ చూడలేకపోతున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డికి ఎప్పుడో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పదవి దక్కి వుండాలి. దానికి కొందరు కాంగ్రెస్ సీనియర్లు అడ్డుపుల్ల వేస్తున్నారు. పోనీ, అలా అడ్డుపుల్ల వేసినోళ్ళెవరైనా కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడపగలరా.? అంటే అదీ లేదు. ఇలాగే కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరుగుతూ వుంటే, ఎక్కువకాలం రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగకపోవచ్చు.
తెలంగాణలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పేది ఎవరన్నా వుంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. ముఖ్యమంత్రిని ఢీ కొట్టడంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అప్పుడప్పుడూ వెనుకంజ వేస్తారేమోగానీ, రేవంత్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గరు. కానీ, కాంగ్రెస్ పార్టీ.. ఆయన్ని ఒక నాయకుడిగానే చూడలేకపోతోందాయె.