ఉత్తరప్రదేశ్ లో దళిత యువతిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడి వెళ్లగా… పోలీసులు రాహుల్ ను అరెస్ట్ చేసి ఆయనపై దౌర్జన్యం చేశారు. దీంతో ఆయన కింద పడిపోయారు.
ఈ ఘటనను తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నాంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
అయితే.. యూత్ కాంగ్రెస్ నేతలు, ఎంపీ రేవంత్ రెడ్డి.. నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీసు వైపు దూసుకెళ్లారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపై దాడికి యత్నించారు. వెంటనే పోలీసులు వచ్చి వాళ్లను నిలువరించారు. అందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా.. రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి తప్పించుకొని… నాంపల్లి రోడ్డుపై పరిగెత్తి అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీదికి వచ్చి అక్కడే కూర్చున్నారు. ధర్నా కొనసాగించారు.
అయితే.. తమపై దాడి చేయడానికి వస్తారా? అని బీజేపీ నేతలు కూడా పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా? అని రేవంత్ ధ్వజమెత్తారు. అర్ధరాత్రి పూట ఆ బాధితురాలి అంత్యక్రియలు అంత సీక్రెట్ గా జరిపించాల్సిన అవసరం ఏం వచ్చింది? అంటూ రేవంత్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు.