ఆ’ విషయంలో రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్

Revanth Reddy Management Skills, Top Class

Revanth Reddy

రేవంత్ రెడ్డి.. తెలుగు నాట రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడే అయినా, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డికి అభిమానులు వున్నారు. వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలేనా.? అన్నది మళ్ళీ వేరే చర్చ. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఓటుకు నోటు కేసు ద్వారా దేశవ్యాప్తంగా ‘గుర్తింపు’ తెచ్చుకున్న (?!) రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు అందుకున్న విషయం విదితమే.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి చాలానే కష్టపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చాలామంది ఆయన ప్రయత్నాలకు అడ్డు తగిలారు. కొందరు ఆయన పీసీసీ అధ్యక్షుడైనట్లు ప్రకటన రాగానే కాంగ్రెస్ పార్టీని వీడారు కూడా. అయితే, తన పట్ల పార్టీలో వ్యక్తమయిన అసమ్మతిని వేగంగా చక్కదిద్దేందుకు పావులు కదిపారు రేవంత్ రెడ్డి.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడి భంగపడ్డ నాయకుల్ని ఆయన కలిశారు, వారితో చర్చించారు. కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పలువురు అసమ్మతి నేతలు, ఆయనతో కలిసిపోయారు. ఇంకొందరు ఇంకా ఎడమొహం పెడమొహం అన్నట్టే వున్నారు.

గత కొద్ది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఓ పీసీసీ అధ్యక్షుడి విషయంలో ఇంత వ్యతిరేకత.. అంతలోనే ఇంత సానుకూలత.. కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించే జరగడం గమనార్హం. పీసీసీ అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న రేవంత్ రెడ్డి, ఇందుకోసం భారీ హంగామానే ప్లాన్ చేశారు. చిత్రమేంటంటే, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన నేతల్లో చాలామంది ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ.

ఆ కారణంగానే పార్టీలో అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి. మరి, వాటిని ముందు ముందు రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు.? అన్నది వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. రేవంత్ తాను అనుకున్నది కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా సాధించేశారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటితమైపోతే, ఆయన జోరు మరో స్థాయిలో వుండబోతోందన్నది నిర్వివాదాంశం. కానీ, అది కాంగ్రెస్ పార్టీలో అంత తేలిగ్గా సాధ్యమయ్యే పనికాదు.