మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరో సాయిధరమ్ తేజ్. మొదట్లో పర్వాలేదనిపించిన తేజూ తర్వాత వరుస ఫ్లాపులతో డల్ అయ్యారు. ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. వరుసగా మూడు చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించడంతో అదే ఉత్సాహంతో దేవ కట్టా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఇందులో సాయి తేజ్ వాయిస్‌తో ‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు… ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది.. ప్రభుత్వమవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’’ అనే డైలాగ్ వినిపించింది. ఈ డైలాగ్‌ని బట్టి చూస్తుంటే సాయి తేజ్ రిపబ్లిక్ కి సరికొత్త అర్దం చెప్పినట్టు అర్దమవుతుంది.
సమ్మర్‌లో విడుదల కానున్న ఈ సినిమలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ,సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సుద్దాల అశోక్ తేజ, రెహమాన్ పాటలు రాశారు. కాగా, లాక్ డౌన్ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు.