Renu Desai Re-Entry : రేణు దేశాయ్ రీ-ఎంట్రీ.! మొత్తానికి ఆమె ప్రయత్నం ఫలించినట్టే.!

Renu Desai Re-Entry : రేణు దేశాయ్.. పరిచయం అక్కర్లేని పేరిది. ‘బద్రి’, ‘జాని’ తదితర సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్, ఆ పవన్ కళ్యాణ్‌తోనే కొంత కాలం సహజీవనం చేసి, ఆ తర్వాత అధికారికంగా పెళ్ళి చేసుకుని, అనూహ్యంగా విడిపోయిన విషయం విదితమే.

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక, సినిమాల్లో రీ-ఎంట్రీ కోసం రేణు దేశాయ్ చాలా ప్రయత్నాలే చేశారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, ఫిలిం మేకర్‌గా రేణు దేశాయ్ రాణించాలనుకున్నారు.. కొన్ని సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం కూడా జరిగింది. అయితే, అవేవీ తెలుగు నాట అంతగా ఆకట్టుకోలేదు. ఒకటీ అరా సినిమాలే అవి.

ఇక, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రేణు దేశాయ్ నటిస్తున్నారిప్పుడు. రవితేజ హీరోగా తెరకెక్కతోందీ సినిమా. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం కూడా ఆమె చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కాల్సిన ఈ సినిమా, రవితేజ చేతికొచ్చింది. నిజానికి, ఇద్దరూ ఒకేసారి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ని ప్రకటించినా, బెల్లంకొండ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

ఇంతకీ, రేణు దేశాయ్ ఈ సినిమా తర్వాత తిరిగి సినిమాల్లో కొనసాగుతారా.? లేదా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైతే, ఆయన్ని చూసి రేణు దేశాయ్ నమస్కరించింది. చిరంజీవి ప్రతి నమస్కారం చేశారు కూడా.