పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మీద ఏ చిన్న కారణం దొరికినా విమర్శలు చేయాలని ప్రత్యర్థులు కాచుకుని ఉంటున్నారు. రాజకీయం, వ్యక్తిగతం అనే తేడా లేకుండా పవన్ కు సంబంధించిన అన్ని విషయాల్లో వేలు పెడుతూ నానా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కుటుంబ విషయాలు అందులోనూ చిరు, నాగబాబులతో ఆయన రిలేషన్ మీద పలువలు చిలువలుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పటికే పలుసార్లు కుటుంబానికి పవన్ కు మధ్య అంతర్గత కలహాలున్నాయనే ప్రచారం చేసిన ప్రత్యర్థులు తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థ వేడుకలో పవన్ కనబడకపోయేసరికి వాయించడం స్టార్ట్ చేశారు.
మెగా కుటుంబంలో చిరు, చరణ్, తేజ్, అల్లు అర్జున్ ఇలా అందరూ వేడుకకు హాజరై సంతోషంగా గడిపారు. కానీ పవన్ మాత్రం వేడుకకు హాజరుకాలేదు. దీంతో ఫ్యామిలీ విబేధాల కారణంగానే పవన్ నిహారిక నిశ్చితార్థానికి వెళ్లలేదని, మొన్నామధ్యన నాగబాబు గాడ్సే విషయంలో చేసిన వ్యాఖ్యల మీద కూడా పవన్ ఘాటుగా స్పందించడమే ఆ గొడవలకి కారణమని, అందరూ కలిసి ఉండాలని చెప్పే పవన్ ఇలా కుటుంబంతో కలవకపోవడమేమిటని పెదవి విరిచారు. తన అభిమాని నితిన్ వివాహ వేడుకకు అయితే వెళ్తారు కానీ కూతురి నిశ్చితార్థానికి రాకపోవడం ఏమిటని నిష్టూరం పోయారు.
దీంతో పవన్ అభిమానులు, మెగా అభిమానులు బాగా డిసప్పాయింట్ అయ్యారు. నిజంగానే కుటుంబ కలహాలు ఉన్నాయేమోనని దిగులుపడ్డారు. కానీ అలాంటిదేమీ లేదని తేలింది. పవన్ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్నారు. దీక్ష నియమాల మేరకు సాయంత్రం 6గంటలు అంటే సూర్యాస్తమయం తర్వాత బయటకురాకూడదట. అందుకే పవన్ వేడుకకు వెళ్లలేదట. కానీ ఆరోజు ఉదయమే ఇంటికి వెళ్లి మరీ నిహారికకు ఆశీస్సులు అందించి వచ్చారని తెలుస్తోంది. సో.. ఈ సమాచారంతో పుకార్లకు ఫులుస్టాప్ పడటమే కాదు అభిమానుల్లో కూడా జోష్ నిండింది.