Realtor Kidnap: ఈ మధ్యకాలంలో సులువైన పద్ధతిలో డబ్బు సంపాదించడం కోసం చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతిరోజు కిడ్నాప్ కేసులు గురించి మనం వింటూనే ఉంటాం. డబ్బు కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తుంటే.. మరికొందరు మాత్రం పాత కక్షల వల్ల కిడ్నాప్ చేస్తుంటారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ లో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ నారాయణగూడ పరిధిలో నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక రియల్టర్ ను కిడ్నాప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా(60) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు.
గుయోష్ పాషా సోమవారం రాత్రి ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వెళుతుండగా సుమారు 12 గంటల 10 నిమిషాల సమయంలో ఇద్దరూ గుర్తుతెలియని వ్యక్తులు పాషా ను వెంబడించి కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్ ఏం వద్ద జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.
పాషా కిడ్నాప్ గురించి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పాషా కిడ్నాప్ కి గల కారణాల గురించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈరోజు ఉదయం పాషా తన కుమార్తె సానాకి ఫోన్ చేసి తన గురించి కంగారు పడవద్దు అని, తను ప్రస్తుతం మొయినాబాద్ లో ఉన్నానని… ఒక గంట తర్వాత ఇంటికి వస్తానని తన కూతురుతో చెప్పినట్టు పాషా అల్లుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు పాషా ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేయగా మొయనా బాద్ పరిసరాలలో పాషా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.