హీరో రామ్.. సినిమాల్లో తప్ప బయట పెద్దగా కనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సోషల్ లైఫ్ ఎక్స్పోజ్ అయ్యేది చాలా తక్కువ. పార్టీలు, పబ్బులు, షికార్లు ఉండనే ఉండవు. ఉంటే షూట్ లేదంటే ఇల్లు. అంతే. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఉన్న ఊపు ఒక దశలో పోయిందనే అనాలి. ఏ సినిమా తర్వాత ఏది చేయాలి, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి అనేది క్లారిటీ లేకుండా సినిమాలు చేసేవారు. అందుకే ఒక మంచి హిట్ పడినా తర్వాత ఫ్లాపులే ఎదురయ్యేవి. రామ్ జర్నీ, చేసిన సినిమాల తీరు చూస్తే ఉండాల్సిన స్థాయిలో లేరని అనిపిస్తుంది. ఎప్పుడో రవితేజ స్థాయి క్రేజ్ తెచ్చుకోవాల్సిన హీరో ఇంకా తక్కువ స్థాయిలోనే ఉండిపోయారని అనిపిస్తుంది.
రామ్ గతంలో వేసిన తప్పటడుగులే ఈసారి కూడ వేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి క్రేజీ హిట్ తర్వాత ‘రెడ్’ చిత్రం చేశారు. మాస్ హీరోగా సెట్లవుదామనుకునే రామ్ లాంటి హీరోకు ‘ఇస్మార్ట్ శంకర్’ గొప్ప అవకాశం. ఆ సినిమా ఇచ్చిన ఇమేజ్, తెచ్చిన ఊపుతో అలాంటి తరహాలోనే వరుసగా ఇంకో రెండు సినిమాలు చేయాలి. అప్పుడే ఆయన మీద మాస్ హీరో అనే మార్క్ బలంగా పడేది. కానీ రామ్ అలా ఆలోచించలేదు. రీమేక్ సినిమా ‘రెడ్’ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ ను ఊహించుకుని ఆహా ఓహో అనుకుంటూ సినిమాకెళ్లిన ఆడియన్స్ నీరసపడిపోయారు. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
దీంతో రామ్ సైతం షాకయ్యాడు. ఏదో అనుకుంటే ఏదో అయిందని, ఊహించని రీతిలో ప్లాన్ ప్లాప్ అయ్యేసరికి ఆలోచనలో పడ్డాడట. అందుకే ఇండస్ట్రీ నుండి సన్నిహితులను, శ్రేయోభిలాషులను పిలిపించి ఏ సినిమాలు చేస్తే కెరీర్లో నిలదొక్కుకోగలం, తన నుండి ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారట. మరి వారు ఏ ఇచ్చారు, ఆ సలహా మేరకు రామ్ ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయన తర్వాతి రెండు మూడు సినిమాలు చూస్తే తెలుస్తుంది.