సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ పోస్ట‌ర్

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చ‌ర‌ణ్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ స్టేట‌స్ పొందాడు. చిరుత అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన చెర్రీ మ‌గ‌ధీర సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఈ సినిమా త‌ర్వాత ప‌లు ఫ్లాప్‌లు చ‌ర‌ణ్‌ని ప‌ల‌క‌రించ‌గా, రంగ‌స్థ‌లం చిత్రం చెర్రీకు న‌టుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. చెవిటి వ్య‌క్తిగా న‌ట విశ్వ‌రూపం చూపించి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న చెర్రీ ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు.

రామ్‌చ‌ర‌ణ్‌పై మెగా అభిమానుల‌కు హ‌ద్దులు దాటిన అభిమానం ఉంది. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు దానిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తాజాగా ఓ అభిమాని రామ్ చ‌ర‌ణ్ పోస్ట‌ర్‌ని తయారు చేయ‌గా, ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య సినిమాలో న‌టిస్తుండ‌గా, ఆచార్య చిత్రంలో చెర్రీ న‌క్స్‌లైట్‌గా క‌నిపించ‌నున్నాడు అని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ అభిమాని ఆ రోల్‌కు త‌గ్గ‌ట్టు పోస్టర్ ను డిజైన్ చేసి వదిలాడు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో ఫుల్ వైర‌ల్ అయింది.

ఆచార్య చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కూడా ఓ హీరోయిన్‌ని తీసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.కాగా, ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.