సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా ఎంత కీర్తి ప్రతిష్టలు పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బస్సు కండక్టర్ నుండి సూపర్ స్టార్‌గా ఎదిగేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. తెలుగు, తమిళ భాషలలోనే కాక దేశ విదేశాలలో ఆయన అశేష అభిమానగణాన్ని పొందారు. 70 ఏళ్ళ వయస్సున్న రజినీకాంత్ తన 45 ఏళ్ల కెరీర్ లో 160 సినిమాలకు పైగా నటించాడు. ప్రస్తుతం అన్నాత్తె అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా వలన ఆగింది.
సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన రజనీకాంత్ రాజకీయాలలోను ఉన్నత స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ భావించారు. సీఎం పీఠంపై రజనీని చూడాలని కలలు కన్నారు. ఆ కల నెరవేరుతుందని భావిస్తున్న తరుణంలో పెద్ద షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31,2020న పార్టీ ప్రకటనతో పాటు జెండా, అజెండాలను తెలుపుతానని చెప్పిన రజనీకాంత్ అనారోగ్యం వలన పాలిటిక్స్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అభిమానుల గుండెలు పగిలేలా చేశాడు. అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అభిమానులు శాంతించారు. . రాజకీయాలు చేయకపోయినా పర్వాలేదు మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు అని వాళ్లు కోరుకున్నారు.
70 ఏళ్ళ వయస్సు ఉన్న రజనీకాంత్‌కు ప్రస్తుతం ఆరోగ్యం ఏ మాత్రం సహకరించడం లేదు. సినిమాలు చేయాలన్నా కూడా కొంత మానసిక ఒత్తిడి తప్పక తీసుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సినిమాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారట. వారి నిర్ణయాలని తలైవా కూడా స్వాగతించినట్టు వార్తలు వస్తున్నాయి. రాజకీయాలు చేయకపోయిన పర్వాలేదు కాని ఇక రజనీకాంత్ సినిమాలు చేయడు అని అఫీషియల్‌గా ప్రకటిస్తే మాత్రం అభిమానుల బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.