రజనీకాంత్ కామెడీ రాజకీయాలు 

Rajinikanth Political Entry a waste effort
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పౌరుడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చు, అధికారాన్ని చేపట్టవచ్చు.  రాష్ట్రపతి పదవికి సైతం కనీస విద్యార్హతలు నిర్ణయించలేదు మన రాజ్యాంగ నిర్మాతలు.  కనుక ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా మనం స్వాగతించాలి.  కాకపొతే ఒక సిద్ధాంతం అంటూ లేకుండా, ప్రజాసేవ అంటే తెలియకుండా, కేవలం తమ గ్లామర్, ప్రజల్లో తమకున్న సినిమా అభిమానాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో సొమ్ము చేసుకోవాలనుకునే గాలివాటం  రాజకీయనాయకులకు అవకాశాలు దొరకడం సులభం కాదు. 
 
Rajinikanth Political Entry a waste effort
Tamil Superstar Rajinikanth

ఒక్క మగాడు ఎన్టీఆర్ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినిమా నటుడు కొంగర జగ్గయ్య మొట్టమొదటిసారిగా సినిమారంగం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు.  ఆ తరువాత పదేళ్లకు ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించారు.  ఆ తరువాత ఆయన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారంనుంచి దించడం, ఆ క్షోభతోనే ఆయన మరణించడం మనం చూసాము.  ఆయన గనుక మరికొంతకాలం జీవించి ఉంటె అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ప్రధానమంత్రి అయ్యేవారని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు నమ్ముతారు.  

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు…..

ఎన్టీఆర్ సాధించిన విజయంతో స్ఫూర్తిని పొందిన కొందరు సినిమా నటీనటులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా పదవులు పొందారు.  ఆ తరువాత చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి కావాలనే వాంఛను తీర్చుకోలేకపోయారు కానీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అనిపించుకోగలిగారు.  అయితే ఆయనకు చిత్తశుద్ధి అనేది లేకపోవడం, ప్రజాసేవ అనే పదానికి ఆమడ దూరం కావడంతో తన రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సినిమారంగంలో కొనసాగుతున్నారు.  ఆయన తరువాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక పార్టీని పెట్టుకుని తనను తాను గొప్పగా ఊహించుకుని, నోటిదురుసుతనంతో అందరినీ దూరం చేసుకుని,  పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెంది కేవలం చంద్రబాబుకు రహస్యమిత్రుడు అనే అపప్రధతో ప్యాకేజీరాయుడుగా అపఖ్యాతి పాలయ్యాడు.  

తమిళనాట సినిమా నటుల జయకేతనం 

తమిళనాడులో అర్ధ శతాబ్దం క్రితం  కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయాక ప్రాంతీయపార్టీల హవా మొదలయ్యాక సినిమాహీరోలు రాజకీయాల్లో కూడా తమ ప్రభావాన్ని చూపించారు.  రచయితగా సుప్రసిద్ధుడైన కరుణానిధి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగగా, ఆయనతో విభేదించి అన్నా డీ ఎం కె పార్టీని నెలకొల్పిన ఎంజి రామచంద్రన్ కూడా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు.  ఆయన తరువాత ఆయన వారసురాలిగా రంగప్రవేశం చేసిన జయలలిత కూడా ముఖ్యమంత్రి అయ్యారు.  ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఆమె అనారోగ్యంతో మరణించారు.  

రజనీకాంత్ మీద పిచ్చి భ్రమలు 

ఇక ఆ తరువాత చాలామంది సినిమా హీరోలు రాజకీయాల్లో ప్రవేశించినా విజయం సాధించలేకపోయారు.  రజనీకాంత్ అనే ఒక తమిళుల ఆరాధ్య సినిమా హీరో గత పదేళ్లుగా పార్టీని స్థాపిస్తానని, అధికారం చేజిక్కించుకుంటానని ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఈరోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు.  ఆరు నెలలకోసారి అభిమానులను సమావేశపరచడం, ఏదో సంచలన ప్రకటన చేస్తారని ఆర్భాటం చెయ్యడం, చివరకు తుస్సుమనిపించడం సాధారణమైపోయింది.  జయలలిత ఉన్నన్నాళ్లూ ఆయన రాజకీయాలవైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోయారు.  అభిమానులకు ఉండే పెద్ద జబ్బు ఏమిటంటే, తమ అభిమాన హీరోలు సినిమాల్లో మాదిరిగానే నిజజీవితంలో కూడా సాహసవంతులు అనే భ్రమల్లో ఉంటారు.  ఆ భ్రమలు తప్పు అని వారి హీరోలు ఎన్నిసార్లు రుజువు చేసినా వారి మనసులో పేరుకుని పోయిన అభిమానం అంగీకరించదు.  తమ హీరో ఏదో సూపర్ మాన్ లా, స్పైడర్ మాన్ లా అద్భుతాలు చేస్తాడని ఊహాప్రపంచంలో విహరిస్తుంటారు.  

సినిమారంగంలో వైఫల్యాలు 

మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని, అధికారం సాధిస్తామని, వ్యవస్థలను మార్చేస్తామని సినిమా తరహా రొడ్డకొట్టుడు ప్రకటనలు చేసి ప్రజలను వెర్రివాళ్లను చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రజనీకాంత్.  గత పదేళ్లుగా హిట్ అన్న మాట వినలేదు రజనీకాంత్.  ఆయన సినిమాలు అన్నీ ఘోరంగా విఫలం అవుతున్నాయి.  రోబో – 1  తరువాత రజనీకాంత్ సినిమా ఏదీ చెప్పుకోదగిన విజయం సాధించలేదు.  ఒక హిట్ పడితే రాజకీయ రంగ ప్రవేశం చెయ్యాలని ఆయన కోరికగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ కోరిక తీరడం లేదు.  ఈ అవకాశం చేజార్చుకుంటే మళ్ళీ అయిదేళ్లదాకా ఎన్నికలు ఉండవు.  అప్పటికి రజనీకాంత్ కు డెబ్బై ఐదేళ్లు దాటుతాయి.  అందుకే ఏదో ఒక హడావిడి ప్రకటన చేసి అభిమానులను సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తున్నారు. 

ఆటలో అరటిపండు అవ్వడమే 

రజనీకాంత్ రాజకీయ ప్రవేశం అంటూ జరిగితే కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ ఆయన్ను వలలో వేసుకోవాలని తప్పకుండా ప్రయత్నిస్తుంది.  రజనీకాంత్ లొంగకపోతే సిబిఐ, ఈడీ , ఆదాయపు పన్ను శాఖ లాంటి సంస్థలను ప్రయోగిస్తుంది.  ఈ వయసులో ఆ దాడులను తట్టుకోవడం రజనీకి కష్టమే.  ఇంకా కాంగ్రెస్ పార్టీకి కూడా రజనీ మీద ఆశ ఉంది.  డీఎంకే, అన్నా డీఎంకే కూడా చూస్తూ ఊరుకోవు.  ఒకవేళ రజనీకాంత్ విజయం సాధించకపోతే ఆ రెండు పార్టీల కక్ష సాధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది.  వీరికి తోడు ఆకలిమీదున్న పులి లాంటి శశికళ ఉండనే ఉన్నది.  ఇంతమందిని ఎదుర్కొంటూ రజనీకాంత్ విజయం సాధిస్తారనుకోవడం మరీచికలో మంచినీటికోసం వెదకడమే.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు