Rajinikanth’s Birthday: భారతదేశ సినీ చరిత్రలో మొట్టమొదటిగా సూపర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్న నటుడు రజనీకాంత్. ఈ ప్రశ్నను దేశంలో ఏ మూలకు వెళ్లి ఎవరిని అడిగినా చెప్పే సమాధానం ఇదే. బడా బడా హీరోలు సైతం తాము రజనీకాంత్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు. ఇక తమిళ తంబీలు అయితే ఆయనను దైవంగా భావిస్తారని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి లెజెండ్ ఈ రోజు 71వ పడిలోకి అడుగెడుతున్న సందర్బంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
కర్ణాటక రాష్ట్రంలో 12 డిసెంబర్ 1950న బెంగుళూరు, మైసూర్ రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక)లో ఒక మరాఠీ కుటుంబంలో రజనీకాంత్ జన్మించారు. అయితే ఆయన అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అని చెబితే చాలా మంది ఇప్పటికి నమ్మలేరు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషలలో ఆయన 160 పైగా సినిమాలలో నటించారు. తనకి మాత్రమే సొంతమైన స్టైల్, మానరిజం, డైలాగ్ డెలివరీతో అశేషమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు.
కర్ణాటకలో బస్ కండక్టర్ గా పని చేసిన రజినీకాంత్ ఇవాళ ఇంతటి స్థాయికి చేరటానికి ఆయనెంతో కష్టపడ్డారు. సినిమాపై ఉన్న ఇష్టంతో ఆయన మద్రాసు వెళ్లి అవకాశాలు కోసం ట్రై చేశారు. కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన అపూర్వ రాగంగల్ చిత్రంలో సహాయక పాత్రతో తన కెరీర్ను ప్రారంభించారు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో ఆయన విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. M. భాస్కర్ దర్శకత్వం వహించిన బైరవి, రజనీకాంత్ సోలో హీరోగా నటించిన మొదటి తమిళ చిత్రం.
1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘బాషా’ సినిమా రజిని కెరీర్ ని టర్న్ చేసిందని చెప్పుకోవాలి. ఆ సినిమా అద్భుత విజయంతో మాస్ హీరోగా ఆయన స్థాయి ఆమాంతం పెరిగిపోయింది. ‘శివాజీ’ సినిమాతో సౌత్ లో అప్పటివరకు ఎవ్వరు సాధించని 100 కోట్ల క్లబ్ లో ఆయన చేరాడు. ఇక ‘రోబో’ సినిమాతో ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు అందుకున్నారు. ఈ ఏజ్ లో కూడా ఆయన సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. రజని సర్ ఇంకెన్నో గొప్ప గొప్ప మూవీస్ చేయాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యాంగా, ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తూ ‘తెలుగు రాజ్యం’ టీం నుండి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.