సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం అభిమానులకు ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. మేజర్ సర్జరీ తర్వాత రజినీ కోలుకున్నప్పటికీ కోవిడ్ సమస్య భయపెడుతూనే ఉంది. ఆయన వయసు పెద్దది కావడంతో వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. లాక్ డౌన్ అనంతరం ‘అన్నాత్తే’ షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ షూటింగ్లో రజినీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అభిమానులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అన్నింటికంటే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచించడంతో రజినీ రాజకీయ రంగప్రవేశాన్ని కూడ మానుకున్నారు.
ఆ తర్వాత కోలుకున్న సూపర్ స్టార్ కొన్ని నెలలు ఇంలోనే ఉండి ఈమధ్యనే షూటింగ్ స్పాట్లోకి అడుగుపెట్టారు. ఈసారి ఏకంగా ఒక డాక్టర్ల బృందాన్నే వెంటపెట్టుకుని షూటింగ్ స్పాట్లోకి అడుగుపెట్టారట అయన. ఆ వైద్యుల బృందం ఎప్పటికప్పుడు రజినీ ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి చిన్న ఇబ్బంది ఎదురైనా తక్షణమే వైద్య సహాయం అందిస్తారు. కరోనా వైరస్ రజినీని తాకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.