వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ  రిపీట్ కాబోతోందా?

దర్శకుడు మణిరత్నం-సూపర్ స్టార్ రజనీకాంత్‌, కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దళపతి’ చిత్రం ఓ క్లాసిక్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ  ఇన్నేళ్ల తర్వాత అంటే దాదాపు 31 ఏళ్లకు  ఈ కాంబినేషన్‌ రిపీట్ కాబోతోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ కాంబినేషన్‌ లో సినిమా తెరపైకి రాబోతున్నదని సమాచారం.

ఇటీవల మణిరత్నం రూపొందించిన చారిత్రక నేపథ్య సినిమా ‘పొన్నియన్‌ సెల్వన్‌ 1’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రజనీ -మణి సినిమాపై ఈ  ఆసక్తి ఏర్పడడానికి కారణమైంది.  ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కథా నేపథ్యం తనకు చాలా ఇష్టమని..ఇందులో ఒక క్యారెక్టర్‌ ఇవ్వమని మణిరత్నంను అడిగినట్లు రజనీకాంత్‌ ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో చెప్పుకున్నారు. అయితే రజనీ ఇమేజ్‌కు ఏ చిన్న క్యారెక్టర్‌నూ ఆయనకు ఇవ్వలేనని మణిరత్నం సున్నితంగా తిరస్కరించారట.

మణిరత్నం దర్శకత్వంలో నటించడం వల్ల నటుడిగా మెరుగయ్యాననీ చెప్పుకున్నారు రజనీకాంత్‌. కలిసి సినిమా చేయాలని ఇటీవల వీరిద్దరు నిర్ణయించుకున్నారు. ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’ పూర్తవగానే రజనీ – మణిరత్నం సినిమా సన్నాహాలు ప్రారంభం కానున్నట్లు  తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక వీరిద్దరి కాంబినేషన్‌ సినిమా పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు.