సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ కోసమే ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా సరే కష్టపడి ‘అన్నాత్తే’ షూటింగ్ ముగించారు. అయితే ఈలోపు కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో రజినీ ప్రయాణం వాయిదాపడింది. ఇండియాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఇండియా నుండి వచ్చే విమానాలను ఇతర దేశాలు నిషేధించాయి. దీంతో రజినీకాంత్ ప్రయాణం ఇంకాస్త వెనక్కి వెళ్ళింది. ఇప్పటికే చాలా రోజులు ఎదురుచూసిన ఆయన ఇకపై ఆలస్యం చేయకూడదని ప్రభుత్వాన్ని స్పెషల్ పర్మిషన్ అడిగారు.
కేంద్ర ప్రభుత్వం కూడ రజినీకాంత్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రత్యేక విమానంలో యూఎస్ వెళ్లడానికి అనుమతులు ఇచ్చారట. పైగా రజినీతో పాటు ఆయన కుటుంబం మొత్తం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకుని ఉండటంతో అనుమతులు త్వరగానే లభించాయట. దీంతో సూపర్ స్టార్ ఛాటెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని కుటుంబ సభ్యులతో సహా అమెరికా వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. రజినీ ఇలా ఉన్నపళంగా అమెరికా వెళ్లారనే వార్తలు విన్న అభిమానులు ఆందోళనకు లోనవుతున్నారు. కాగా రజినీ కొన్నేళ్ల క్రితం అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ చికిత్సకు సంబంధించే ఆయన తరచూ యూఎస్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు.