ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోకి అనూహ్య రీతిలో వచ్చిన సోము వీర్రాజుగారు అంతే అనూహ్యంగా పని చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో బీజేపీ గతంతో పోలీస్తే చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రభుత్వం మీద ప్రతిపక్షం కంటే అధిక మోతాదులో విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. వీర్రాజు పదవిలోకి వచ్చిన నాటి నుండి బీజేపీ టచ్ చేయని విషయమంటూ లేదు. పవన్ అండ ఎలాగూ ఉంది కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. దేవాలయాల మీద దాడుల అంశాన్ని హిందూత్వం మీద జరిగే దాడులుగా అభివర్ణిస్తూ కషాయ దండు చేస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. వీర్రాజు అయితే దేశంలో హిందూత్వాన్ని పాటించేది, కాపాడేది బీజేపీ మాత్రమేనని అభివర్ణించుకుంటున్నారు.
దీంతో వీర్రాజు మీద బీజేపీ అధిష్టానానికి మంచి అభిప్రాయం ఏర్పడుతోంది. ఆయన ఇదే ఫ్లోను ఇంకొన్నాళ్లు కొనసాగిస్తే సుధీర్ఘ కాలం అధ్యక్ష పదవిలో ఉండటమే కాదు జాతీయ స్థాయిలో పెద్ద పదవులను చెజెక్కించుకునే అవకాశం ఉంది. కానీ భవిష్యత్ పరిణామాలను ఊహిస్తే మాత్రం వీర్రాజుగారికి అవకాశం ఉన్నా అదృష్టం ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఈ అనుమానానికి కారణం మరెవరో కాదు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన సొంత పార్టీ వైసీపీ మీద, సీఎం వైఎస్ జగన్ మీద ఏ స్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ తిరుగుబాట్ల అంతిమ లక్ష్యం వైసీపీ నుండి సస్పెండ్ కాబడి దర్జాగా బీజేపీలో చేరడం.
అదే జరిగితే నరసాపురంలో ఉపఎన్నిక ఖాయం. ఆ ఎన్నికల్లో ప్రధానంగా రఘురామరాజు వెర్సెస్ వైఎస్ జగన్ అన్నట్టు సాగుతుంది పోటీ. ఆ ఎన్నికల్లో రఘురామరాజును గెలిపించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. అంటే మిత్రపక్షం జనసేనతో పాటు కలిసి వస్తానంటే టీడీపీ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కలిసొచ్చి రఘురామరాజు ఎంపీగా గెలిస్తే జగన్ మీద తిరగబడి గెలిచారనే ఇమేజ్ వచ్చేస్తుంది. అప్పుడిక ఏపీ బీజేపీ ఫేస్ ఆయనే అవుతారు. ఆ తర్వాత ఏముంది అధ్యక్ష పదవిలో ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తినే కూర్చోబెడితే లాభం కదా అనే ఆలోచన మొదలవుతుంది అధిష్టానంలో. మొదలుకాకపోయినా మొదలయ్యేలా చేయగలరు రాజుగారు.
నిజంగా అధ్యక్ష పదవి కోసం రఘురామరాజు, సోము వీర్రాజు పోటీ పడితే రఘురామరాజుకున్న బలాలే ఎక్కువ. ఎలాగూ ఎంపీ అనే అలంకారం ఉంటుంది, ఆర్థికంగా కూడ ఆయనే బలవంతుడు, జనాకర్షణ సైతం ఆయనకే అధికం. ఇక ఢిల్లీ స్థాయిలో ఆయన పరిచయాల గురించి చెప్పాల్సిన పనే లేదు. అలా వీర్రాజును అధ్యక్ష పీఠం నుండి లేపేసీ అందులో సెటిలవ్వడం రఘురామకృష్ణరాజుకు పెద్ద కష్టమేమీ కాదు.