రఫేల్ రాజకీయ యుద్ధం మళ్ళీ మొదలైంది..

Rafale Political Fight Again Kickstarts..

Rafale Political Fight Again Kickstarts..

కాంగ్రెస్ హయాంలోనే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధమయ్యింది. అయితే, ఆ డీల్ కాస్త ఆలస్యమయ్యింది. బీజేపీ హయాంలో డీల్ ఖరారయ్యిందిగానీ.. కాంగ్రెస్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం కంటే తక్కువ విమానాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 100కు పైగా రఫేల్ యుద్ధ విమానాలు కొనాలన్నది మన్మోహన్ సింగ్ హయాంలో తెరపైకొచ్చిన ప్రతిపాదన.

అప్పటికి ఆ డీల్ విలువ సుమారు 50 వేల కోట్లు. దాదాపు అంతే మొత్తం డీల్ నరేంద్ర మోడీ హయాంలో ఖరారయ్యిందిగానీ, కేవలం 36 విమానాల్నే కొనుగోలు చేయాలని నిర్ణయించడం వివాదాలకు తావిచ్చింది.

రఫేల్ అంటే కేవలం యుద్ధ విమానాలు మాత్రమే కావనీ, అంతకు మించిన వివిధ వ్యవస్థలూ పొందుపరచడం ద్వారా కొత్త డీల్ ఖర్చు.. పాత డీల్ ఖర్చుతో సమానమై, తక్కువ విమానాలు దేశంలోకి వస్తున్నాయని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

ఇదిలా వుంటే, రఫేల్ యుద్ధ విమానాల్ని భారతదేశానికి విక్రయించే క్రమంలో జరిగిన డీల్ వెనుక పెద్ద మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.

బీజేపీకి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ ఈ డీల్ వ్యవహారానికి సంబంధించి భాగస్వామిగా వ్యవహరించడంతో వివాదం మరింత ముదిరి పాకాన పడుతోంది.

దేశ రక్షణ రంగంలో రఫేల్ ఒ కొత్త అధ్యాయం. కానీ, ఆ డీల్ వెనుక వున్న అనుమానాలు.. రోజురోజుకీ బలపడుతుండడంతో.. నరేంద్ర మోడీ సర్కార్ ముందు ముందు తలనొప్పులు ఎదుర్కోక తప్పేది లేదు. మంది బలంతో కాంగ్రెస్ నోరు నొక్కేయొచ్చుగాక. కానీ, దేశ ప్రజలకు మోడీ సర్కార్ సమాధానం చెప్పి తీరాల్సిందే.