Radhe Shyam : ‘భీమ్లానాయక్’ సినిమాకి విడుదల రోజున పెద్దగా నెగెటివిటీ కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన రాజకీయ ఆంక్షల కారణంగా ‘భీమ్లానాయక్’ విషయంలో హీరోలందరి అభిమానులూ ఒక్కతాటిపైకొచ్చారు. నిజానికి, ‘రాధేశ్యామ్’ విషయంలో ఆంక్షల్లేకపోయినా, ఆయా హీరోల అభిమానులు ‘రాధేశ్యామ్’ సినిమా సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షించారు.
సినిమాలో పేస్ నెమ్మదిగా వుందన్న విషయాన్ని పక్కన పెడితే, అర్థరాత్రి దాటాక.. అంటే, విడుదలకు ముందు రోజు రాత్రి.. అంటే మార్చి 10 రాత్రి 11 గంటలకు మొదలైన నెగెటివిటీ అలా అలా కొనసాగుతూనే వుంది. ప్రధానంగా అల్లు అర్జున్, మహేష్, జూనియర్ ఎన్టీయార్ అభిమానుల పేరుతో కొందరు ఈ నెగెటివిటీని తెరపైకి తెచ్చారు.
ప్రభాస్ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులు బాసటగా నిలిస్తే, ప్రభాస్ – పవన్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టేందుకు చిత్ర విచిత్రమైన విన్యాసాల్ని ఇతర హీరోల అభిమానుల ముసుగులో కొందరు దురభిమానులు తెరపైకి తెచ్చారు.
వెరసి, సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ చుట్టూ పాజిటివిటీ, నెగెటివిటీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా సాగింది. అంతిమంగా సినిమా బావుంటే, దాని విజయాన్ని ఏ రాజకీయమూ, ఏ నెగెటివిటీ అడ్డుకోలేదనుకోండి.. అందుకు ‘బీమ్లానాయక్’ పెద్ద ఉదాహరణ.
ఏదిఏమైనా, ఈ సోషల్ నెగెటివిటీ కాస్తా హీరోల అభిమానుల మధ్య అర్థం పర్థం లేని యుద్ధానికి తెరతీస్తుండడం బాధాకరమే.