పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ ఒకేసారి మూడు సినిమాలకు సైన్ చేశారు. ఎప్పుడూ లేనంతగా ఒకేసారి రెండు సినిమాలను సమాంతరంగా చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఎలాగైనా రెండు సినిమాలను రిలీజ్ చేయాలనేది ఆయన ఆలోచన. అందుకే పనులన్నింటినీ పక్కనబెట్టి షూటింగ్లోనే బిజీగా ఉంటున్నారు. ఇక అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలైతే పవన్ చుట్టూ కంచె వేసినట్టే ఉంటున్నారు. నేరుగా కాకపోయినా మేనేజర్ల ద్వారా అయినా తమ పరిస్థితిని పవన్ దృష్టికి తీసుకెళుతున్నారు. ఆయన్ను పక్కకు పోనియ్యకుండా ఉంచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. లాక్ డౌన్ ముందే పవన్ వారి నుండి అడ్వాన్సులు పుచ్చుకుని ఉండటంతో వారి మాటను మీరడానికి లేకుండా పోయింది.
అందుకే కీలకమైన మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నా కూడ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లలేకపోతున్నారు. ఏకధాటిగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్, క్రిష్ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. రెండు సినిమా సెట్లను పక్కపక్కనే వేసుకుని మరీ పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించేసి పార్టీ పనుల్లో, ప్రచారంలో పాల్గొనాలని ఆయనకు ఉన్నా వీలుకాని పరిస్థితి. వడ్డీలకు అప్పులు తెచ్చి పారితోషకాలు ఇచ్చిన అది కూడ ఒక్కొక సినిమాకు రూ. 50 కోట్ల వరకు సమర్పించుకున్న నిర్మాతల సంకట పరిస్థితిని అర్థంచేసుకుని ఆగిపోవాల్సి వచ్చింది.