లాజిక్స్ పట్టించుకోకుండా కేవలం నవ్వుకోవడానికే తీసిన సినిమా ‘జాతిరత్నాలు’. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ప్రీరిలీజ్ బిజినెస్ మీద మూడు రెట్లు లాభాల్ని తెచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కథైతే లేదు కానీ పడి పడి నవ్వుకోవచ్చు అంటున్నారు. స్పూఫులు, సింగిల్ లైన్ పంచ్ డైలాగులు ఇలా అప్పటికప్పుడు నవ్వుకోవడమే తప్ప కథ, కథనం ఎటు పోతుంది, సినిమాలో ఎమోషన్ ఏంటి అనేవి ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు ఆలోచించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలోని అన్ని పాత్రల్లానే మనమూ ఒక జాతిరత్నమే అని డిసైడ్ అయిపోయి చూడాల్సిన సినిమా.
నిర్మాతలు ఏ నమ్మకం పెట్టుకుని చేశారో తెలీదు కానీ చివరికి వారి నమ్మకం నిజమై సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ ప్రయోగాలు ప్రతిసారీ ఫలిస్తాయని అనుకోలేం. ఇలాంటి సినిమానే అదే డైరెక్టర్, అదే నటులు, అదే నిర్మాత మరోసారి చేస్తే హిట్ అవుతుందని చెప్పలేం. అంత ప్రమాదకరమైన ప్రయోగం ఉంది. మన ఇండస్ట్రీ సంగతి తెలిసిందే కథ. ఒక ఫార్ములా సక్సెస్ అయితే దాన్నే పట్టుకుని వరుసపెట్టి సినిమాలు చేసేస్తారు. ఆ జానర్ మీదే జనానికి మొహం మొత్తేసేలా చేస్తారు. ప్రజెంట్ చిన్నా చితక నిర్మాతలు ఇదే చేస్తున్నారు. ప్రతిఒక్కరూ ‘జాతిరత్నాలు’ లాంటి ఫన్ సినిమా కావాలంటున్నారు. అదే తరహాలో లాజిక్స్ లేకుండా కామెడీ మీద నడిచే కథలు రాయమని తమను అప్రోచ్ అవుతున్న కొత్త దర్శకులకు చెబుతున్నారట.
కొందరైతే పనిగట్టుకుని మరీ కథా బృందాలను కూర్చోబెట్టి అలాంటి లాజిక్ లెస్ కథల్ని వండిస్తున్నారు. రానున్న ఐదారు నెలల్లో ఈ సినిమాలన్నీ వరుసపెట్టి దిగుతాయి. వాటిలో 70 నుండి 80 శాతం సినిమాలు తేలిపోతాయి. మిగిలినవి ఏదో అరకొర అనిపించుకుంటాయి. అంతేకానీ ఏ ఒక్కటీ కూడ ‘జాతిరత్నాలు’లా నక్క తోక తొక్కినట్టు సూపర్ హిట్ కాలేదు. గనుక చిన్న నిర్మాతలు కొద్దిగా ఆలోచించి ఎప్పుడో జరిగే అద్భుతాల వెంటపడకుండా కథ అనదగిన కథల్ని పట్టుకుని సినిమాలు చేసుకుంటే మంచిది.