మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యం లో హీరో పృథ్వీరాజ్ పంచుకున్న ‘కడువా’ చిత్ర విశేషాలివి…
# మీ చిత్రాలు ఎక్కువగా రిమేక్, ఓటీటీలో విడుదల అవుతాయి.. కడువా ని థియేటర్స్ లో విడుదల చేయడానికి కారణం ?
– గత చిత్రం ‘జనగణమన’ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల విడుదల అయ్యింది. నా వరకూ ఎక్కడో చోట పాన్ ఇండియా థియేటర్ రిలీజ్ ని మొదలుపెట్టాలి. అది ‘కడువా’ తో చేస్తున్నా. భవిష్యత్ లో రిమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. భవిష్యత్ లో ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా పెద్ద సినిమాలు కేవలం ఓటీటీ మీద ఆధారపడి బిజినెస్ చేసే పరిస్థితి వుండదు. రాజమౌళి గారు బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఒక మోడల్ ని చూపించారు. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఆ చిత్రాలు మెయిన్ స్ట్రీమ్ గా రిలీజ్ అయ్యాయి. ఈ మోడల్ ని ఫాలో అవ్వాలి. కేజీఎఫ్ చిత్రం కూడా ఇదే మోడల్ లో విడుదల అయ్యింది. ముఖ్యంగా పెద్ద స్కేల్ సినిమాలు భవిష్యత్ లో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. నేను ‘కడువా’తో ఆ ప్రయత్నం మొదలుపెట్టాను.
# ‘కడువా’ సినిమా జోనర్ ఏంటి ?
– మలయాళం చిత్రాలు వాస్తవికం, తెలివి, ఆలోచన రేకెత్తించే చిత్రాలుగా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి పేరు రావడం మాకూ ఆనందమే. 2019లో ఈ కథ విన్న తర్వాత.. ఇలాంటి సినిమాని మలయాళం పరిశ్రమ వదిలేసిందా ? అనిపించింది. ఒక నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా అన్ని రకాల సినిమాలని ఇష్టపడతాను. కానీ మలయాళంలో కొనాళ్ళుగా థియేటర్ లో హాయిగా కూర్చుని పాప్ కార్న్ తింటూ విజల్స్ వేస్తూ ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు రాలేదు. ఈ కథని చేయడానికి కారణం అదే. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
# కడువా అంటే ?
– కడువా అంటే పులి. ఇందులో హీరో పేరు కడువకున్నేల్ కురువచన్.. షార్ట్ కట్ లో కడువా అని వుంటుంది. అందుకే ప్రతి భాషలో అదే పేరుని పెట్టాం.
# మీరు పార్లల్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్నారు కదా ? మీ ఫేవరేట్ ?
– నా ద్రుష్టి గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ అనే వుంటుంది. పార్లల్ కానీ కమర్షియల్ కానీ ప్రేక్షకులని యంగేజ్ చేసి వుంచితే అదే గుడ్ మూవీ. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నపుడు ఫోన్ లో మెసేజులు చెక్ చెక్ చేసుకుంటూ దిక్కులు చూస్తుంటే అది బ్యాడ్ మూవీ. ఇందులో గుడ్ మూవీస్ చేయాలని తాపత్రయపడుతుంటాను.
# చాలా విరామం తర్వాత షాజీ కైలాస్ దర్శకత్వంలో చేయడం ఎలా అనిపించింది ?
– షాజీ కైలాస్ సినిమాలు చూసి చాలా ప్రేరణ పొందా. నా లూసిఫర్ లో కూడా షాజీ కైలాస్ మార్క్ కొన్ని చోట్ల కనిపిస్తుంది. మాస్ ఎంటర్ టైనర్ కమర్షియల్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఈ కథ వినగానే ఇది షాజీ కైలాస్ సినిమా అనిపించింది. ఆయన ఫోన్ చేసి ‘మీరు డైరెక్ట్ చేస్తే ఈ సినిమాని నేనే ప్రోడ్యుస్ చేస్తా’ అని చెప్పా. ఆయన ఒప్పుకున్నారు. ‘కడువా’ షాజీ కైలాస్ మార్క్ తో ప్రేక్షకులని అలరిస్తుంది.
# కడువా కథ గురించి వివాదం జరిగింది కదా ? ఇది రియల్ స్టొరీనా ?
– రచయితకి మరో వ్యక్తికి మధ్య వివాదం వచ్చింది. కోర్టు రచయితకి అనుకూలంగా తీర్పు ఇస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ వివాదం గురించి నాకు ఇంతకంటే ఎక్కువ తెలీదు. నిజ జీవితం ఆధారంగా ప్రేరణపొంది ఈ కథని తయారుచేశారా అనేది చెప్పలేను. రచయిత ఎక్కడ నుండైనా ప్రేరణ పొందివుండవచ్చు. నాకు తెలిసి ఈ కథ ఫిక్షన్. నా పాత్ర కడువకున్నేల్ కురువచన్ ఒక ధనికుడు. ఒక వ్యక్తితో చిన్న ఈగో సమస్య మొదలై పెద్ద హింసకు దారితీస్తుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం వుండబోతుంది.
# అయ్యప్పన్ కోషియమ్ లో కూడా ఈగో పాయింట్ వుంటుంది కదా ?
– అయ్యప్పన్ కోషియమ్ లో ఈగో పాయింట్ వుంటుంది. అయితే అయ్యప్పన్ కోషియమ్ సినిమాటిక్ గా చాలా రియల్ స్టొరీ. కానీ కడువా కమర్షియల్, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. అయ్యప్పన్ కోషియమ్ తో పోల్చుకుంటే కడువా డిఫరెంట్ ఎక్సపిరియన్స్ ని ఇస్తుంది. అలాగే పూర్తిగా భిన్నమైన కథ. అయ్యప్పన్ కోషియమ్ తో ఎలాంటి పోలికలు వుండవు.
# అయ్యప్పన్ కోషియమ్ రిమేక్ ని చూశారా ?
– లేదండీ. రానా నా కోసం స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారు. కానీ నాకు కుదరలేదు. షూటింగ్ కోసం చాలా కాలం అల్జీరియా, జోర్డాన్ లో వుండిపోవాల్సి వచ్చింది.
# నటన, దర్శకత్వం, నిర్మాణం , పాటలు పాడటం… ఇన్ని పనులు ఎలా చేస్తుంటారు ?
– వీటన్నిటిని విడివిడిగా చూడను. సినిమాలో భాగమే ఇవన్నీ., ఐతే ఇందులో నిర్మాణంకు మాత్రం డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఒక సపోర్ట్ సిస్టం కావాలి. నా భార్య ఈ విషయంలో సపోర్ట్ గా వుంటారు. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఇలాంటి ఆసక్తికరమైన పనులు నేను చూసుకుంటాను. జీఎస్టీ, ఫైల్స్, రసీదులు ఇలాంటి బోరింగ్ పనులన్నీ నా భార్య చూస్తుంది( నవ్వుతూ).
# జేక్స్ బిజోయ్ సంగీతం గురించి చెప్పండి ?
– ఈ మధ్య కాలంలో నా సినిమాలన్నీ దాదాపు జేక్స్ బిజోయ్ చేస్తున్నారు. చాలా ప్రతిభ వున్న కంపోజర్. కడువా మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది.
# మీ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి కదా.. మీ వైపు నుండి సలహాలు ఇస్తారా ?
– సలహాలు ఇచ్చే అంత పెద్ద వాడిని కాదు. లూసిఫర్ చిరంజీవి గారు చేస్తున్నారు. నేను తెలుగు లో డైరెక్ట్ చేసివుంటే ఆయనే నా ఫస్ట్ ఆప్షన్. మలయాళం కంటే పెద్ద స్కేల్ లో సినిమా ఉండబోతుందని నమ్ముతున్నా. కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేనూ ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నా.
# ఓటీటీని గేమ్ చేంజర్ గా బావిస్తున్నారా ?
– పాండమిక్ తర్వాత ఓటీటీ ఉదృతి పెరిగిందని భావిస్తున్నాం. అయితే ఏదో ఒక సమయంలో ఓటీటీ వేదికలు రావాల్సిందే. ఈ రెండేళ్ళతో ప్రేక్షకుల అభిరుచి కూడా కాస్త మారింది. అయితే థియేటర్ కి ఉండాల్సిన ప్రత్యేక ఎప్పటికీ వుంటుంది. ఐదు వందల మంది కలసి థియేటర్ లో సినిమాని ఎంజాయ్ చేయడం ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ఓటీటీ ఇవ్వలేదు. కడువా లాంటి లార్జ్ దెన్ లైఫ్ సినిమాలు థియేటర్ లో చూస్తేనే ఆనందం.
# లూసిఫర్ రీమేక్ కి దర్శకత్వం అవకాశం వదులుకోవడానికి కారణం ?
– అందరిలానే నేనూ చిరంజీవి గారికి అభిమానిని. లూసిఫర్ రీమేక్ చేయమని అడిగారు. కానీ అప్పటికి వేరే సినిమాతో బిజీగా వుండటం వలన కుదరలేదు. అంతకుముందు సైరా నరసింహ రెడ్డిలో కూడా ఒక పాత్ర చేయమని కోరారు. అప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా వుండటం వలన వీలుపడలేదు. చిరంజీవి గారితో పని చేయాలని వుంది. లూసిఫర్ 2 చేస్తున్నా. ఒకవేళ దీనికి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తా.
# ఆల్ ది బెస్ట్
– థాంక్స్