హాస్పిటల్ లో చేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ .. హెల్త్ బులిటెన్ రిలీజ్

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆర్మీ ఆసుపత్రిలో (ఆర్ ఆండ్ ఆర్) చికిత్స నిమిత్తం తరలించారు. ఛాతీలో తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందనీ, అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. కొన్ని సాధారణ పరీక్షలను మాత్రం నిర్వహించాల్సి ఉంటుందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఓ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. రామ్ నాథ్ కోవింద్ ఆసుపత్రి పాలయ్యారన్న వార్త తెలిసి కేంద్ర ప్రముఖులు ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.

president gives consent for three farm bills
president 

’శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి వచ్చారు. ఛాతిలో స్వల్ప నొప్పికారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు మేం టెస్టులను నిర్వహించాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. కొన్ని సాధారణ పరీక్షలను మాత్రం నిర్వహించాల్సి ఉంది.‘ అని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఓ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవలే కరోనా టీకాను వేయించుకున్నారు. రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆయన కరోనా టీకాను తీసుకున్నారు. మార్చి మూడో తారీఖున ఆయన కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసును వేయించుకున్నారు. ఆయనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని వ్యక్తిగత వైద్య సహాయకులు తెలిపారు. ఆయన కరోనా టీకాను వేయించుకున్న ఐదు రోజులకు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ సతీమణి, భారత తొలి మహిళ సవితా కోవింద్ కూడా వ్యాక్సినేషన్ మొదటి డోసును తీసుకున్నారు. ఇద్దరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని వైద్యులు తెలిపారు.