‘మా’ ఎన్నికలు ముగిశాయ్.. కానీ, ‘మా’ రాజకీయం ముగియలేదు. అసలు దానికి ముగింపే వుండదు. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఎత్తులకు పై యెత్తులూ కొనసాగుతున్నాయి. ఇది ఎప్పటిదాకా వెళుతుందో ఎవరూ ఊహించలేరు.
గెలిచినోళ్ళు బాధ్యతగా వుండాల్సింది పోయి, ప్రత్యర్థి వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. ఓడిపోయారు కదా, కాస్త సంయమనం పాటిస్తున్నారు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవాళ్ళు. మోహన్ బాబు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు, విష్ణు వ్యవహరిస్తున్న తీరు, నరేష్ చేస్తున్న ఓవరాక్షన్.. ఇవన్నీ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతున్నాయి.
కాగా, ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ చేసిన తాజా వ్యాఖ్యలు మళ్ళీ దుమారానికి కారణమవుతుండడం గమనార్హం. ప్రతి నెలా రిపోర్టు కార్డు అడిగి, ప్రశ్నిస్తూనే వుంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశాడు. ‘నెలవారీ రిపోర్ట్ కోసం అడగాల్సిన పనిలేదనీ, వెబ్‌సైట్‌లో వుంటుందనీ’ నరేష్ వెటకారం చేశాక, ప్రకాష్ రాజ్ నుంచి ఈ స్టేట్‌మెంట్ రావడం గమనార్హం.
మోసం చేసి గెలిచారన్నది ప్రకాష్ రాజ్ వాదన. వ్యవహారం పోలీసులదాకా వెళ్ళింది. సీసీ ఫుటేజీల్లో ఏముందో తేలాల్సి వుంది. మోహన్‌బాబు వెనకాల పది మంది వుంటే, ఆయన రెచ్చిపోతాడనీ.. సింగిల్‌గా వుంటే అస్సలేమీ మాట్లాడలేడనీ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి కారణమవుతుండడం గమనార్హం.