ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరహాలో ‘మా’ ఎన్నికల కోసం హంగామా జరగడం అందర్నీ విస్మయానికి గురిచేస్తుంటుంది. ఎవరు గెలిచినా, ఆ తర్వాత అందరూ ఒక్కటై పని చేయాల్సిందే. అలాంటప్పుడు ‘మా’ ఎన్నికలు, యుద్ధం తరహాలో ఎందుకు జరుగుతాయి.? ఒకరి మీద ఇంకొకరు ఆరోపణల బురద చల్లేసుకుంటుంటారు. కులాన్ని, ప్రాంతాన్ని కూడా తెరపైకి తెస్తుంటారు. ఈసారి యుద్ధంలో.. అదేనండీ ‘మా’ ఎన్నికల బరిలోకి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ తమ ప్యానళ్ళతో దిగుతున్నారు. ప్రకాష్ రాజ్ కొన్నాళ్ళ క్రితమే పూర్తి ప్యానల్ ప్రకటించగా, మంచు విష్ణు తాజాగా ప్రకటించారు. ఇరు వైపులా హేమాహేమీలున్నారు. ‘మా’ కోసం ఓ భవనం కావాలన్నది విష్ణు ఆలోచన.

‘మా’ భవనం కంటే ముఖ్యమైన అంశాలు చాలా వున్నాయన్నది ప్రకాష్ రాజ్ అభిప్రాయం. ఎవరి గోల వారిదే. ఈ ఇద్దరికీ సినీ పరిశ్రమలో అండగా నిలిచే పెద్దలెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అక్టోబర్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అప్పటిదాకా రచ్చ రచ్చ అయిపోతుంటుంది సినీ పరిశ్రమలో. నిజానికి, ఈ ఎన్నికల్ని చాలామంది లైట్ తీసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అనవసరమైన హడావిడి చేస్తుంటారు. గెలుపు కోసం భారీగా ఖర్చు చేస్తుంటారనే ఆరోపణలూ లేకపోలేదు. ఎవరో ఒకరు గెలుస్తారు.. ఆ తర్వాత అందరూ కలిసి పని చేస్తారు. ఈలోగా మాత్రం ఈ రచ్చ, రాజకీయాలకు మించి వుంటుంది. అదంతా సినీ రాజకీయం అంతే. అన్నట్టు, ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున పోటీ పడుతున్న జీవిత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ అప్పుడే విష్ణు ప్యానల్ తరఫున పోటీ చేస్తున్న పృధ్వీ ఆరోపణలు చేయడం పరిశ్రమలో ‘కాక’ రేపింది.