గెలుపోటములు శాశ్వతం కాదు. ఓటమి, గెలుపుకి తొలి మెట్టు అనుకోవాలి ఎవరైనా. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఆయన్ని గెలిపిద్దామనుకున్న నాగబాబు ఆశలు అడియాశలుగా మారిపోయాయ్. అంతే, తొలుత నాగబాబు రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తన రాజీనామాపై ప్రకటన చేశారు.
స్థానికత ఆధారంగా ఎన్నికలు జరిగాయంటూ ప్రకాష్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది నిజమే అయి వుండొచ్చుగాక. ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరెన్ని అడ్డదారులు తొక్కినా.. అదంతా ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో మామూలే. సినీ రాజకీయాలు, సాధారణ రాజకీయాలు వేర్వేరు కావు. ఏదైనా పదవి కోసమే.
డబ్బు ఖర్చు పెట్టడం, కులం పేరు వాడుకోవడం లేదా కులం పేరుతో దూషించడం, ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తేవడం, మతం కోణాన్నీ ప్రస్తావించడం.. ఇదంతా రాజకీయాల్లో భాగమైపోయింది. ప్రకాష్ రాజ్ ఇవన్నీ తెలియని అమాయకుడైతే కాదు. బీజేపీని రాజకీయంగా ప్రకాష్ రాజ్ విమర్శించినప్పుడు ఇలాంటివన్నీ ప్రస్తావనకు వచ్చాయ్, వస్తాయ్.
పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అలాగని ఆయన రాజకీయాల నుంచి తప్పుకోలేదు. అసలు తాను ఓడిపోయాననే భావనలోనే పవన్ వుండరు. లక్షల మంది తనకు ఓట్లేశారు గనుక, వారందరి మనసుల్నీ గెలుచుకున్నాననే భావన ఆయనలో వుంటుంది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ గెలిచాడు, మరికొందరు కూడా గెలిచారు. ప్రకాష్ రాజ్ కూడా 350 పై చిలుకు ఓట్లను గెలుచుకున్నారు. విష్ణు సుమారుగా మరో వంద ఓట్లు అదనంగా గెలుచుకున్నాడంతే. తనకు ఓటేసినవారి సంక్షేమం గురించి ప్రకాష్ రాజ్ ఆలోచించాలి కదా.? వారి సమస్యలపై గళం విప్పాలి కదా.?
ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి, తాను రాజీనామా చేస్తున్నానని ప్రకాష్ రాజ్ చెప్పడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఓడితే, విమానమెక్కి వెళ్ళిపోతాడు.. గెలిచినా పట్టించుకోడు.. అంటూ ప్రకాష్ రాజ్ గురించి మంచు విష్ణు చెప్పిందే నిజమయ్యింది.
ప్రకాష్ రాజ్, తనను బలపర్చినవారందర్నీ ఇప్పుడు మోసం చేసినట్టు లెక్క.. మా సభ్యత్వానికి రాజీనామా చేయడమంటే.