‘మా’ ప్రతిష్ట మసకబారడానికి కారణమెవరు ప్రకాష్ రాజ్.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. బరిలో మంచు విష్ణు నిలబడుతున్నారు. అందరికన్నా ముందు నుంచే హడావిడి మొదలెట్టింది ప్రకాష్ రాజ్. జీవిత, హేమ.. చిత్ర విచిత్రమైన ట్విస్టులిచ్చారు.. నానా హంగామా చేసి, చివరికి ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో చేరిపోయారు. ప్రకాష్ రాజ్ నుంచి దూరంగా జరిగిన బండ్ల గణేష్, వివాదాల చిచ్చు రాజేస్తున్నాడు. ఇంతకీ, ‘మా’ ఎన్నికల్లో గెలుపెవరిది.? ఏమోగానీ, తాము గెలిస్తే, 10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. అయితే, 10 కోట్లతో కార్పస్ ఫండ్ ఎలా.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఇదిలా వుంటే, కొందరి వల్లే ‘మా’ ప్రతిష్ట మసకబారిపోతోందంటూ ప్రకాష్ రాజ్ ఎవరి పేరూ ప్రస్తావించకుండా కొందరి మీద ఆరోపణలు చేశారు.

ఆ కొందరు ఎవరు.? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘మా’ విషయమై రాజకీయాల తరహాలో ఆరోపణలు చేసుకుంటూ రావడం సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆరోపణలు చేసుకున్నారు. అప్పుడు ఇప్పటికంటే దారుణమైన భాష ప్రయోగించారు. ఇప్పుడూ క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. కొందరు హీరోలు సైతం ఓటింగ్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నది ప్రకాష్ రాజ్ ఆరోపణ. అదీ నిజమే. కానీ, ఎందుకిలా జరుగుతోంది.? వెయ్యి మంది కూడా సభ్యులు లేని మా అసోసియేషన్ ఎన్నికల కోసం ఇంత రగడ ఎందుకు.? ఎన్నికలయ్యాక.. అంరదూ కలిసి సినిమాలు చేసుకోవాల్సిందే. అందుకే, ఈ అనవసరపు రచ్చకి చాలామంది దూరంగా వుంటున్నారు. ఇక, ‘మా’ ప్రతిష్ట మసకబారడానికి కారణమెవరో ప్రకాష్ రాజ్ ఆయా పేర్లను చెప్పి తీరాలి. ఉత్త ఆరోపణలు చేస్తే సరిపోదిక్కడ.