ఆలిండియా ఫాలోయింగ్ వున్న ఏకైక పానిండియా స్టార్ గా ప్రభాస్ ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు పానిండియా సినిమాలు నిర్మాణ దశలో వుండగా సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ ప్రకటించారు.నిజానికి 2019 లో ‘సాహో’ తర్వాత ఇంకో
సినిమా విడుదల కాకపోయినా, వరసగా నాలుగు పానిండియా సినిమాలుభారీ బడ్జెట్ లతో ఆల్రెడీ సెట్స్ పై వున్నాయి. రాధేశ్యామ్, సాలార్, ఆదిపురుష్, ఇంకా పేరు పెట్టని ఒక సైన్స్ ఫిక్షన్ మొదలైనవి. ‘స్పిరిట్’ తాజాగా ప్రకటించారు. ఇలా అయిదు సినిమాల్లో ఒక్కటీ విడుదల కాకుండానే ఏకైక పాన్ ఇండియా స్టార్ గా సంచలనానికి కారణమయ్యాడు.
మైథాలజీ, రోమాంటిక్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ కథాంశాలతో డిఫరెంట్ మెగా మూవీస్ చేస్తున్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ నాలుగు సినిమాలూ లాక్ డౌన్ సమయంలో ప్రకటించినవే. కోవిడ్ సంక్షోభంతో భవిష్యత్తు గురించి ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియని సమయంలో, ప్రభాస్ నాలుగు పానిండియా సినిమాలు సైన్ చేయడం సంచలనమే సృష్టించింది. పాన్ఇండియన్ ప్రేక్షకుల కోసం, అంటే మాస్ అండ్ క్లాస్, ఈస్ట్ అండ్ వెస్ట్, సౌత్ అండ్ నార్త్ చుట్టేస్తూ అతడి స్టార్ డమ్ వెలిగిపోతోంది. సౌత్ స్టార్స్ చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టి, ఆఖరికి రజనీ కాంత్ సైతం సాధించలేనిది ప్రభాస్ ఏకబిగిన సాధించేస్తున్నాడు. తను ఇకపై తెలుగు మాట్లాడే మార్కెట్ కోసమే సినిమాలు చేస్తాడనేది లేకుండా పోయింది.
కల్చర్ లో వచ్చిన మార్పు ప్రభాస్ కి కలిసి వస్తోంది. మునుపటి హిందీ హీరోలు హిందీ బాలీవుడ్ ని జయించడానికి, అక్కడి నేటివిటీతో మసాలా సినిమాలు చేసేవారు. ఆ సినిమాలే దేశవ్యాప్తంగా ఆడేవి. కానీ గ్లోబల్ గా సినిమాలు ప్రక్షకుల చేతికొచ్చాక నేటివిటీకి అంతగా ప్రాధాన్యమే లేకుండా పోయింది. ఇంకెంత మాత్రం సౌత్ హీరోలని హిందీ వాళ్ళు ‘మద్రాసీ యాక్టర్’ అనే చిన్న చూపు చూసే అవకాశం లేకుండాపోయింది. దీన్ని ‘బాహుబలి’ తో వచ్చిన పేరుతో క్యాష్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఇలా తను సౌత్ నుంచి వచ్చిన తొలి పాన్-ఇండియన్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు.
ప్రభాస్ తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడే హిందీ ప్రేక్షకులు పరిచయమయ్యారు. ఎలాగంటే అతడి తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్లు టీవీల్లో బాగా పాపులర్ అయ్యాయి. ఇక ‘బాహుబలి’ నేరుగా స్టార్ ని చేసింది.
బాలీవుడ్ నటులు ప్రభాస్ నుంచి నేర్చుకోవాల్సింది వుంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి ఓ ఇద్దర్ని మినహాయిస్తే, ఇతర బాలీవుడ్ స్టార్లు ఒక సినిమా సైన్ చేయడానికే చాలా కాలం తీసుకుంటారు. ప్రభాస్ సూపర్ సోనిక్ స్పీడుతో సినిమాల్ని సైన్లు చేస్తూ పోతూ బాలీవుడ్ స్టార్స్ చాప కిందికి నీరు తెచ్చేట్టు వున్నాడు. పైగా బాలీవుడ్ స్టార్స్ లా కాక, ప్రభాస్ మల్టీ ప్లేక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు, బి-సి సెంటర్లలో సైతం దూసుకుపోయే సినిమాలతో వచ్చేస్తున్నాడు. సౌత్ హీరోలు బాలీవుడ్ ని జయించడానికి విఫల యత్నాలు చేశారు. ప్రభాస్ పానిండియా సినిమాలతో బాలీవుడ్ ని కూడా జయించేస్తున్నాడు. ఇప్పుడతను చేస్తున్న ఐదు సినిమాల బడ్జెట్ వెయ్యి కోట్లకి చేరింది. ‘స్పిరిట్’ కి రెమ్యూనరేషన్ 150 కోట్లు!