ఆంధ్ర రాష్ట్రంలో అశేష ప్రేక్షకాభిమానం కలిగిన యాక్టర్ పవన్ కళ్యాణ్. ప్రభుత్వాలని ప్రశ్నించడానికి జనసేన అనే పార్టీ ని కూడా పెట్టారు. అంతకు పూర్వం ప్రజారాజ్యం యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షులుగా కూడా చేశారు. యువరాజ్యం అధ్యక్షులుగా, జనసేన అధినేతగా అనేక మంది నాయకులకు ఎన్నికల్లో ప్రచారం చేశారు వారి గెలుపుకు కారణం కూడా అయ్యారు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ వలెనే 2014 లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని అయన అభిమానులు చెబుతుంటారు.
అయితే తాజాగా ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ వలెనే తాను 2014 ఎన్నికల్లో ఓడిపోయాను అని చెప్పుకొచ్చారు. ముఖ ముఖి కార్యక్రమంలో ఒక యాంకర్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఒక ప్రశ్న వేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చెయ్యడం వలెనే మీరు 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారంట, అయితే ఇప్పుడు అంతర్వేది రధం ఘటనలో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆయన్నే విమర్శిస్తున్నారంట, పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మీకు లేదని అయన అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటని సదరు యాంకర్ వెల్లంపల్లి ని అడిగారు.
ఈ ప్రశ్నలతో చిరాకు పడిన మంత్రి, 2009 మరియు 2019 లో పవన్ కళ్యాణ్ నాకు ప్రచారం చెయ్యకపోవడం వలెనే నేను గెలిచాను, 2014 లో పవన్ కళ్యాణ్ వెల్లంపల్లి శ్రీనివాస్ కు వోట్ వెయ్యండని చెప్పడం వలెనే నేను ఓడిపోయాను అని సమాధానం చెప్పారు. ఇంకా సమాధానం పొడిగిస్తూ, నన్ను గెలిపించా అనే గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆయనే రెండు చోట్ల ఎందు ఓడిపోయారో చెప్పాలి అని చురకంటించారు. దీని మీద తన సమాధానం ముగిస్తూ, తన రాజకీయ జీవితం మొదలవ్వడానికి చిరంజీవి కారణం అందుకు ఆయనకు రుణపడివుంటాను కానీ పవన్ కళ్యాణ్ వలన నాకు ఎటువంటి మేలు జరగలేదని చెప్పుకొచ్చారు.