దాదా సాహెబ్ ఫాల్కే.. రజనీకాంత్ రాజకీయమేంటి చెప్మా.?

రజనీకాంత్ రాజకీయం చేస్తున్నారా.? లేదంటే, ఆయన పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోందా.? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రజనీకాంత్ అభిమానుల్ని కలవరపెడుతున్న అంశమిది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు రజనీకాంత్ ప్రకటించడమే కాదు, అందుకు తగ్గ సరంజామా కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా రాజకీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారీ తమిళ సూపర్ స్టార్. అలా ఆయన వెనక్కి తగ్గడానికి కారణం భారతీయ జనతా పార్టీయేననే చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రజనీకాంత్, ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. నిజంగానే ఆయనకు ఆ అర్హత వుంది.

రజనీకాంత్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కించుకోవడమంటే, ఆ అవార్డుకే గౌరవం పెరిగినట్లు. కానీ, తమిళనాడు ఎన్నికల సమయంలో ఇదంతా జరగడమే రాజకీయ అనుమానాలకు కారణమైంది. ఏ రాజకీయ లబ్ది ఆశించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వ్యూహం పన్నినట్లు.? అని రజనీకాంత్ అభిమానులే ప్రశ్నిస్తున్నరు సోషల్ మీడియా వేదికగా. ఈ రోజుల్లో ఎన్ని అర్హతలు వున్నా.. దాంతో పనిలేదు. ఆ అర్హతకు మించి ఇంకోటేదో వుండాలి. అది రజనీకాంత్ ద్వారా బీజేపీ ఆశించింది. అందుకే, ఆయనకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. అయితే తమిళ ఓటర్లు ఇలాంటి తాయిలాలకు పడిపోయే రకం కాదు. జాతీయ పార్టీల్ని అస్సలు పట్టించుకునే పరిస్థితి తమిళనాడులో వుండదు. స్థానిక రాజకీయాలే తమిళనాడు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అధికార అన్నాడీఎంకే మిత్రపక్షం బీజేపీ. అలా రజనీకాంత్ ఓటు బ్యాంకుని అన్నాడీఎంకే వైపు మళ్ళించే యత్నం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో బీజేపీ చేసిందని అనుకోవాలి.