Elections: కరోనా వైరస్, అందర్నీ దాదాపు ఒకేలా చూస్తోంది. డబ్బున్నోడినీ, డబ్బు లేనోడినీ, పలుకుబడి వున్నోడినీ, పలుకుబడి లేనోడినీ.. ఎత్తుకెళ్ళిపోతోంది. రాజకీయ నాయకులూ ఇందుకు అతీతమేమీ కాదు. అధికారులూ కరోనా వైరస్ దెబ్బకి బలైపోతున్నారు. నిజానికి, ఇదొక చిత్రమైన.. అత్యంత బాధాకరమైన పరిస్థితి. దేశం ఇంతకు ముందెన్నడూ చూడని భయానకమైన పరిస్థితి. కానీ, రాజకీయం అస్సలు మారడంలేదు. సహచరులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నా రాజకీయ నాయకుల్లో భయం కనిపించడంలేదు. బాధ్యత అసలే కనిపించడంలేదు.
అసలు కరోనా మహమ్మారి దేశాన్ని ముంచెత్తుతున్న సమయంలో ఎన్నికలేంటి.? ఆ ఎన్నికల్లో ప్రచారమేంటి.? కాస్తంత ఇంగితం కూడా ఎవరికీ లేకుండా పోయిందాయె. ఎన్నికలు జరుగుతున్నాయి.. కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోతూనే వున్నారు. అయినా, కొత్తగా ఎన్నికలకు రంగం సిద్ధమవుతూనే వుంది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అనాలా.. ఇంకేమన్నా అనాలా.?
తెలంగాణలో పలు మునిసిపాలిటీలకు జరుగుతున్నఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్నికల అధికారులు నేల మీద వున్నారా.? ఆకాశంలో వున్నారా.? వారికి వాస్తవ పరిస్థితులు ఎందుకు కనిపించడంలేదు.? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించింది హైకోర్టు. కేంద్ర ఎన్నికల సంఘంపై హత్య కేసు పెట్టాలని ఇటీవల మద్రాసు హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. కానీ, ఆ అవకాశం వుంటుందా.?
అధికారులు, అధికారంలో వున్నవారికి తొత్తులుగా మారిపోయి, ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నా, అలాంటివారిపై చర్చలకు అవకాశం వుండకపోవచ్చు. ఎందుకంటే, దేశంలో వ్యవస్థలు అంతలా దిగజారిపోయాయి. ఖమ్మం, వరంగల్ సహా పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో.
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. ఈ ఎఫెక్ట్.. రానున్న రోజుల్లో తెలంగాణ మీద చాలా గట్టిగా పడబోతోంది. పోటీ చేసిన అభ్యర్థులూ ఫలితాలు రాకుండానే ప్రాణాలు కోల్పోయిన సంఘటనల్ని దేశవ్యాప్తం చూస్తున్నాం. అయినా, పాలకులు, ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ పార్టీలు, నాయకులు.. మారే అవకాశమే లేదు.