స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమా నిర్మాణం కూడ భారీ స్థాయిలోనే జరుగుతోంది. చిత్రంలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ జనాల్ని బాగా ఆకట్టుకుంది. ప్రతి సినిమాలోనూ తన స్టైల్ తో కొత్తదనం చూపించే బన్నీ ఈ సినిమాలో డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఇదే అభిమానులకు కొంత ఆందోళనగా ఉంది. స్టైలిష్ బన్నీని మిస్సవుతామని కంగారుపడుతున్నారు వాళ్ళు. కానీ అలాంటి భయమేమీ అక్కర్లేదట. ఎందుకంటే బన్నీ పాత్రలో ఇంకొక యాంగిల్ కూడ ఉంటుందట.
ఆ యాంగిల్ సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ ట్విస్ట్ అని అంటున్నారు. ‘పోకిరి’ సినిమా తీసుకుంటే పోకిరిలా తిరుగుతూ రౌడీలను ఏరిపారేసే పండు ప్రీక్లైమాక్స్ సమయానికి కృష్ణమనోహర్ ఐపీఎస్ అయిపోతాడు. ఆ ట్విస్ట్ బ్రహ్మాండంగా పేలింది. అప్పటివరకు అలా అలా సాగిపోతున్న సినిమాను ఒక్కసారిగా వేరే లెవల్లో నిలబెట్టేసింది. ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ ట్విస్టుల్లో ఒకటిగా నిలిచిపోయింది. అలాంటి ట్విస్టే ‘పుష్ప’లో కూడ ఉంటుందట. స్మగ్లర్ పుష్పరాజ్ లో ఇంకో కోణం ఉంటుందట. అది రివీల్ అయితే అప్పటివరకు సినిమాను చూసిన కోణం ఒక్కసారిగా మారిపోతుందట.
అదే కథలో పెద్ద ట్విస్ట్ అని, సుకుమార్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రాసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినబడుతోంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి, బన్నీని ఎలా రివీల్ చేస్తారు, పోకిరి తరహాలోనే అప్పటివరకు నెగెటివ్ షేడ్స్ చూపించిన హీరో ఒక్కసారిగా అసలు సిసలు హీరోగా మారిపోతాడా అనేది చూడాలి.