పెట్రో మంట: తగ్గితే క్షేమమా.? ప్రమాదమా.?

దోచిందెంత.? తగ్గిస్తున్నదెంత.? అని దేశమంతా పెట్రో ధరల విషయమై నరేంద్ర మోడీ సర్కారుని ప్రశ్నిస్తోంది. పెట్రోలు మీద లీటరుకి ఐదు రూపాయలు, డీజిల్ మీద లీటరుకి పది రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఎక్సైజ్ సుంకం తగ్గింపు. దానికి అనుగుణంగా పెట్రో ధరలు తగ్గిన మాట వాస్తవం.

దేశంలో పలు రాష్ట్రాలు, అదనపు తగ్గింపులు చేపట్టాయి. దాంతో, ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. అలాగని, ఏ డెబ్భయ్ రూపాయలకో పెట్రోల్ ధర చేరుకుందనుకునేరు.. ఛాన్సే లేదు. 100 రూపాయలకు అటూ ఇటూగా పెట్రోలు, 95 రూపాయలకు అటూ ఇటూగా డీజిల్ ధర చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో అయితే, కేంద్రం తగ్గింపు మినహా.. రాష్ట్రాల ప్రభుత్వాలు తగ్గించిందేమీ లేదు. ముందు ముందు కేసీయార్, జగన్ ప్రభుత్వాలు తగ్గింపులకు దిగుతాయేమో ఇప్పుడే చెప్పలేం.

అసలు పెట్రోల్, డీజిల్ ధరల మీద ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం ఎలా తగ్గించగలిగింది.? తద్వారా వచ్చే నష్టాన్ని ఎలా భర్తీ చేయబోతోంది.? ప్రభుత్వాలు ఏవన్నా సుంకాలు తగ్గించడమంటూ జరిగితే, ఇంకో వైపు నుంచి అంతకు మించిన బాదుడు తప్పదు. ఎందుకంటే, ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకోవు. తగ్గించుకుంటే, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అధికారంలో వున్నవారికి కుదరని పని.

అద్గదీ అసలు సంగతి. పెరుగుట విరుగుట కొరకే.. అని పెద్దలు అంటుంటారు. కానీ, ఇక్కడ తగ్గుట.. విరుగుట కొరకే.. అని అనాల్సి వస్తుంది. సుంకాలు తగ్గాయంటే, పెను ప్రమాదం ముంచుకొస్తున్నట్లే. ఆ బాదుడు ఎలా వుండబోతోందన్నది ఊహలకే అందదు.