దేశంలో పెట్రో మంట.. ఎక్కడిదాకా వెళుతుందట.?

Petro Hike
Petro Hike
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, దేశాన్ని అభివృద్ధి చేయడంలో తిరోగమన పద్ధతిలోకి వెళిపోతున్నా.. పెట్రో ధరల విషయంలో మాత్రం గ్రాఫ్ నిటారుగా పైకి తీసుకెళుతోంది. సెంచరీ ఇప్పటికే దాటేసిన పెట్రో ధర దేశంలో 110 రూపాయల మార్కు దాటేయడానికి పరుగులు పెడుతోంది. ఆ ముచ్చట కూడా కొద్ది రోజుల్లోనే తీరిపోవచ్చు.
 
ఆ తర్వాత పరుగు 120 వైపుగా.. ఈ లెక్కన లీటర్ పెట్రో ధర దేశంలో 150 రూపాయలు దాటడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఏడాది చివరి నాటికి దేశంలో పెట్రో ధర లీటర్ 200 రూపాయలకు చేరువైనా వింతేమీ వుండదనే విమర్శ విపక్షాల నుంచి వినిపిస్తోంది. అసలు దేశంలో పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.? అన్న ప్రశ్నకు నరేంద్ర మోడీ సర్కార్ దగ్గర సరైన సమాధానమే లేదు.
 
పెట్రో ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు.. చమురు సంస్థలు అంతర్జాతీయ స్థాయి ధరలకు అనుగుణంగా దేశంలోని ధరల్లో మార్పులు చేస్తున్నాయని కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించిన విషయం విదితమే. మరి, యూపీఏ హయాంలో 120 డాలర్లకు పైగా క్రూడ్ ఆయిల్ ధరలు (బ్యారెల్) వున్నప్పుడు దేశంలో 90 రూపాయలకు కూడా వెళ్ళలేదు లీటర్ పెట్రోల్ ధర.. మరెలా, ఇప్పుడు దేశంలో పెట్రో ధర 100 దాటింది.? అంటే, నో ఆన్సర్.
 
పెరుగుతున్న పెట్రో ధరతో అటు చమురు సంస్థలు పండగ చేసుకుంటున్నాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకీ పన్నుల రూపంలో ఆదాయం దండగా లభిస్తోంది. సామాన్యుడి జేబు మాత్రం అత్యంత దారుణంగా తగలడిపోతోంది. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వాలు ఎప్పుడు కోలుకుంటాయోగానీ, ఈలోగా సామాన్యుడు సమిధలా మారిపోతున్నాడు. దీన్ని దోపిడీ అనాలో, శిక్ష అనాలో అర్థం కావడంలేదు. ఓటేసిన నేరానికి, ఈ శిక్ష అనుభవించాల్సిందేనన్న వాదన సామాన్యుల నుంచి వినిపిస్తోంది.