పేర్ని నాని పేల్చిన బాంబు.. సినీ పరిశ్రమ ఇప్పటికైనా స్పందిస్తుందా.?

తెలుగు సినీ పరిశ్రమ ఇరకాటంలో పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో. సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే ఓ పోర్టల్ పెట్టి విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం విదితమే. ఇంకోపక్క, టిక్కెట్ల ధరల్ని నియంత్రిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం దెబ్బకి ‘వకీల్ సాబ్’ సినిమా వసూళ్ళు దారుణంగా మారిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పెద్ద సినిమాలకు టిక్కెట్ల ధరల్ని కొన్ని రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు గతంలో వుండేది.. ఇప్పుడది లేదు. దీనికి తోడు, సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ప్రభుత్వ పెత్తనం.. అంటే, సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్‌లో మూడినట్టే. ఈ వ్యవహారంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. విపక్షాల విమర్శల్ని తిప్పి కొట్టారు. సినీ పరిశ్రమ పెద్దలే ఆన్ లైన్ టిక్కెట్ విధానం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి అందించారు.

ఆ వినతిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.. ఇదీ పేర్ని నాని ఉవాచ. ఆ సినీ పరిశ్రమ ప్రముఖుల పేర్లను కూడా పేర్ని నాని వెల్లడించారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితరుల పేర్లను చదివి వినిపించారు పేర్ని నాని. ఇప్పుడు వీళ్ళంతా స్పందించాలి. సినీ పరిశ్రమ తరఫున సినిమా టిక్కెట్ల అమ్మకాల్ని ప్రభుత్వమే చేపట్టడంపై పరిశ్రమ పెద్దలు సానుకూలంగా స్పందిస్తారా.? ఇంకా మౌనమే దాల్చుతారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. దర్శకుడు దేవ్ కట్టా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా తప్పు పట్టిన విషయం విదితమే. తమిళ నటుడు విశాల్ మాత్రం, వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. తమిళనాడులో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే బావుంటుందీన చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద, బంతి ఇప్పుడు టాలీవుడ్ కోర్టులో పడిందన్నమాట. సినిమా టిక్కెట్లపై ప్రభుత్వ పెత్తనాన్ని సినీ పరిశ్రమ స్వాగతిస్తుందా.? వేచి చూడాల్సిందే.