
మిత్రపక్షం జనసేన మీద రాజకీయంగా దూషణలు పెరిగిపోయిన నేపథ్యంలో, బీజేపీ నుంచి ఒకరిద్దరు నేతలు ‘సానుభూతి వచనాల్ని’ సోషల్ మీడియా వేదికగా జనసేన మీద కురిపిస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతల్ని సన్నాసులు, వెధవలని అన్నారు. అందునా, మంత్రి పేర్ని నాని పేరు ప్రస్తావించకపోయినా, ఆయన్నే నేరుగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.
సినిమా కార్యక్రమంలో సినిమా సంబంధిత విషయాలు మాట్లాడటంలో తప్పు లేదు. కానీ, అదొక రాజకీయ విమర్శల వేదికైపోయింది. అందుకే, సినీ పరిశ్రమ నుంచీ పవన్ కళ్యాణ్ ఆశించిన మద్దతు పొందలేకపోతున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే పరిశ్రమలో ఆయన ఒంటరి అయిపోయారు. ఆయన్ని అభిమానించే నటీనటులు, దర్శక నిర్మాతలు.. ఎవరూ ఇప్పుడు ఆయన పట్ల సానుకూలంగా కనిపించడంలేదు. అలాంటప్పుడు మిత్రపక్షం బీజేపీ మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది.? నిజానికి, బీజేపీ ఏనాడూ పవన్ కళ్యాణ్ కోసం త్యాగాలు చేసింది లేదు.పైగా, జనసేన పోరాటాల్ని లైట్ తీసుకుంది.
జనసేన మాత్రం, చాలా సందర్భాల్లో బీజేపీకి అండగా నిలిచింది. బీజేపీ నేతల మీద దాడి జరిగితే స్వయంగా పవన్ కళ్యాణ్ ఖండించారు. భౌతిక దాడి కంటే, ఈ బూతుల దాడి అత్యంత హేయం. మరి, పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ నేతలెందుకు గట్టిగా పెదవి విప్పడంలేదు. బీజేపీతో తమకు ప్రయోజనం లేనప్పుడు, బీజేపీ వల్ల నష్టమే ఎక్కువగా వున్నప్పుడు.. ఎన్నాళ్ళు ఆ పార్టీని పట్టుకుని వేలాడుతుంది జనసేనాని.?
బద్వేల్ ఉప ఎన్నిక నేపథ్యంలో అయినా బీజేపీతో పొత్తు విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటే మంచిదేమోనన్న భావన జనసైనికుల్లో కనిపిస్తోంది. కానీ, ఇప్పటికిప్పుడు బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకునే అవకాశం లేదు. బీజేపీ తమకు బలహీనతగా మారిపోతున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి జనసేనది.
‘అది పవన్ పార్టీ వ్యవహారం.. మాకేం సంబంధం.?’ అంటూ సినీ పరిశ్రమకే చెందిన బీజేపీ నేత ఒకరు నిన్న ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో లైట్ తీసుకున్న వైనం బీజేపీ – జనసేన పార్టీల మధ్య వున్న సంబంధాల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతోంది.
