చిరంజీవి నుంచి ‘రాజకీయ సాయం’ కోరనున్న జనసేనాని.?

2024 ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరవెనుక సన్నాహాలు జోరుగానే చేసుకుంటున్నారు. కులాల్ని కలిపే ఉన్నతమైన ఆలోచన.. అంటూ పైకి చెబుతూనే, తెరవెనుకాల బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గానికి అంతకన్నా బలమైన గాలం వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్, తన అన్న చిరంజీవి సాయం కోరబోతున్నారట. అతి త్వరలో చిరంజీవిని పవన్ కళ్యాణ్, అధికారికంగా.. అదీ రాజకయ అవసరాల నిమిత్తం కలిసి, రాజకీయ అంశాల్ని చర్చిస్తారట. నిజానికి, ఈ ప్రతిపాదన, ఓ ప్రధాన సామాజిక వర్గ ప్రముఖుల నుంచి వచ్చిందట. తొలుత తటపటాయించిన పవన్, చివరికి ఒప్పుకున్నారట.

2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీతో అధికారం దక్కించుకోవాలనుకున్నారు చిరంజీవి. ఆ సమయంలోనూ ఆ ప్రధాన సామాజిక వర్గం, అనూహ్యంగా చివరి నిమిషంలో చిరంజీవికి హ్యాండించింది. దాంతో, పవన్ ఎంతవరకు ఆ సామాజిక వర్గం తాలూకు ఓటు బ్యాంకుని నమ్ముకోగలరు.? అన్నది ఆలోచించాల్సిన విషయమే.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన దుమారం సహా అనేక అంశాలపై ఇప్పటికే అన్నదమ్ములిద్దరి మధ్యా రహస్య మంతనాలు జరిగాయని అంటున్నారు. నిజానికి పవన్ – చిరంజీవి మధ్య గ్యాఫ్ ఎప్పుడూ లేదు. అలాగని, పవన్ చేసే ప్రతి విషయాన్నీ చిరంజీవి సమర్థించరు.

కాకపోతే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న ఆలోచన మెగాస్టార్ చిరంజీవికి కూడా వచ్చిందట. ‘ఇదే మంచి తరుణం..’ అని ఆయన భావిస్తున్నారని సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, తెరపైకి తానొస్తే.. మళ్ళీ రాజకీయాల్లో ఎలాంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న చిన్న సందేహం అయితే చిరంజీవికి గట్టిగానే వుంది.