పోలవరం ప్రాజెక్టు కారణంగా భూముల్ని, జీవనాన్నీ కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిందే. ‘మానవీయ కోణం’లో వారి బాధల్ని అర్థం చేసుకోవడమే కాదు, బాధ్యతగా వారికి మెరుగైన రీతిలో పునరావాసం కల్పించి తీరాలి. అత్యద్భుతమైన పునరావాసం పొందే హక్కు పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు వుంది. అయితే, పాలకులు మాత్రం ప్రాజెక్టులు కట్టే సమయంలో నిర్వాసితులకు ‘కథలు’ చెబుతుంటారు తప్ప, వారి ఆవేదనను అర్థం చేసుకోరు.
ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా అదే పరిస్థితి. ప్రాజెక్టులు పూర్తయ్యాక కూడా పునరావాసం దక్కని బాధితులు ఎందరో కనిపిస్తారు.. ఆయా ప్రాజెక్టుల విషయంలో. ఇక, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరుగుతుందా.? అంటే, ఛాన్సే లేదని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ, వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటలకీ, కింది స్థాయిలో వాస్తవాలకీ సంబంధం వుండడంలేదు. ముంపు ప్రాంతాల నుంచి బాధితుల్ని తరలించే క్రమంలో అధికారులు వ్యవహరిస్తున్న శైలి వివాదాస్పదమవుతోంది. బాధితుల ఇళ్ళను బలవంతంగా కూలగొడుతున్నారన్నది జనసేన ఆరోపణ. ఈ మేరకు జనసైనికులు గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితుల్ని తెలుసుకుని, పార్టీ నాయకత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదికను స్టడీ చేసిన పవన్ కళ్యాణ్, పునరావాసం పూర్తిస్థాయిలో అందించాకే ముంపు బాధితుల్ని తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత.
ఇది ఖచ్చితంగా మానవ హక్కుల హననమే అవుతుంది గనుక, మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే, పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జనసేన అధినేత ప్రశ్నించాల్సి వుంది. ఎందుకంటే, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. పునరావాసానికి కేంద్రం ఇవ్వాల్సిన స్థాయిలో నిధులు ఇస్తే, ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అది ఉపకరిస్తుంది.. ముంపు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది కూడా. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం కూడా నెపాన్ని కేంద్రం మీద నెట్టేయకుండా తమ రాష్ట్ర ప్రజల విషయంలో బాధ్యతగా వ్యవహరించి తీరాలి.