జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంటారు. వరుసగా కొన్ని ట్వీట్లేయడం, ఆ తర్వాత మళ్ళీ ట్విట్టర్ మొహం కూడా చూడకపోవడం.. ఇదంతా చాలాకాలంగా జరుగుతున్న తంతు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మీద ప్రశంసలు గుప్పిస్తూ వరుస ట్వీట్లేసిన పవన్ కళ్యాణ్, దానికిగాను విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. తాజాగా వైఎస్ జగన్ సర్కారు మీద పవన్ కళ్యాణ్ ట్వీటేసి, ‘ట్రోలింగ్’ దారుణంగా ఎదుర్కొటంటున్నారు. ‘పబ్లిక్ మనీ వేస్టెడ్.. ఇల్లీగల్ శాండ్ మైనింగ్.. నో జాబ్స్.. జగన్ చీటెడ్ యూత్, లిక్కర్ మాఫియా, పొలిటికల్ వెండెట్టా, అప్పలు ప్రదేశ్..’ ఇలా పలు అంశాల్ని పేర్కొంటూ ఓ స్నాప్ షాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇంకేముంది.? నెగెటివిటీ షురూ అయ్యింది.
పవన్ కళ్యాణ్ మీద అంతకు మించిన స్థాయిలో విరుచుకుపడుతున్నారు వైసీపీ మద్దతుదారులు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అనీ, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినోడనీ.. ఇంకేవేవో పదాలు ప్రస్తావిస్తూ అచ్చం పవన్ ట్వీటేసిన స్నాప్ షాట్ తరహాలోనే, వైసీపీ మద్దతుదారులూ ఓ స్నాప్ షాట్ ప్రచారంలోకి తెచ్చారు. అసలు పవన్ ఇప్పుడెందుకు వున్న పళంగా వైఎస్ జగన్ సర్కార్ మీద సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీ షురూ చేసినట్లు.? ఏమోగానీ, పవన్ మాత్రం అంతకు మించిన స్థాయిలో నెగెటివిటీని రుచి చూస్తున్నారు. అయితే, పవన్ ట్వీట్ మాత్రం జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపింది. అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్‌లో పవన్ పర్యటించనున్న దరిమిలా, అందుకు ముందుగా పొలిటికల్ హీట్ పెంచేందుకు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాని ఎంచుకున్నారా.? అయినా అయి వుండొచ్చు.