సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా సినిమాలు నిర్మించబోతున్నారు. మొత్తం 15 సినిమాల్ని నిర్మిస్తారట. ఇందుకోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే మరో సినీ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయనున్నారు పవన్ కళ్యాణ్. చాలాకాలం క్రితమే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ప్రారంభమైంది.
ఈ బ్యానర్ ద్వారా క్రియేటివ్ టీమ్ కూడా గతంలో తయారయ్యింది. కొన్ని కారణాలతో ఆ టీమ్ తన ఉనికిని కోల్పోయింది. పవన్ రాజకీయాల్లోకి రావడం సహా చాలా అంశాలు ఆ టీమ్ చెల్లాచెదురైపోవడానికి కారణమయ్యాయంటారు. అయితే, అప్పట్లో ఆ టీమ్ తరఫున పనిచేసినవాళ్ళంతా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే ఆరాధనా భావంతోనే వున్నారు. వారిలో కొంతమంది ఇప్పుడు ఈ 15 సినిమాల నిర్మాణం కోసం పనిచేయనున్నారట. వీటిల్లో మూడు అత్యంత భారీ చిత్రాలు వుంటాయనే ప్రచారం జరుగుతోంది. వాటిల్లో మళ్ళీ ఓ సినిమా చిరంజీవి – చరణ్ కాంబినేషన్ వుండొచ్చని సమాచారం.
తన అన్నయ్యతో ఓ పెద్ద సినిమా చేయాలన్నది పవన్ కళ్యాణ్ కోరిక. అదే సమయంలో, తాను నిర్మాతగా బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలని రామ్ చరణ్ కూడా చాన్నాళ్ళుగా అనుకుంటున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అలాగే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తాయని కొన్నాళ్ళ క్రితం ప్రచారం జరిగింది. ఏమయ్యిందోగానీ, ఈ ప్రయత్నాలు సఫలం కాలేదు. అంతా బాగానే వుందిగానీ, రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా వుంటోన్న పవన్, కాస్త సమయం చూసుకుని నటనను మళ్ళీ కొనసాగిస్తున్న దరిమిలా, కొత్తగా ఈ నిర్మాణం అనే బాధ్యతను భుజానికెత్తుకోవడం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందట.?