బీజేపీకి వ్యతిరేకంగా అడుగులేయనున్న జనసేనాని పవన్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేయబోతున్నారా.? ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానికెత్తుకోనున్నారా.? ఇవన్నీ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే షురూ చేస్తారా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. జనసైనికులైతే, తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కోరుకుంటున్నారు.

ప్రత్యేక హోదా సహా చాలా అంశాల్లో కేంద్రం, రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదు. పెట్రో ధరలు సహా చాలా విషయాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పైగా, బీజేపీ – వైసీపీ మధ్య తెరవెనుకాల ‘సంబంధం’ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఇంకా బీజేపీతో కొనసాగడం వల్ల జనసేనకు నష్టమేనన్నది జనసైనికుల అభిప్రాయం.

‘అయినాగానీ, పార్టీ అధినేత నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి వుండాల్సిందే..’ అంటూ తమను తాము సముదాయించుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా జనసైనికులు. తప్పదు, జనసైనికుల అభిప్రాయాలకు అధిష్టానం వద్ద విలువ లేనప్పుడు, వాళ్ళలా సర్దుకుపోవాల్సిందే.

తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసి వుంటే, ఆ పోటీ కాస్త గట్టిగా వుండేది. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకపోవడం వల్ల జనసేన ఎన్నికల గుర్తుకే ఇప్పుడు ముప్పు వచ్చి పడ్డట్టయ్యింది. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేనకు బీజేపీ సహకరించలేదన్న ఆవేదన జనసైనికుల్లో వుంది.

అయితే, బీజేపీనో మరో పార్టీనో సాయం లేకుండా జనసేన అసలు రాజకీయాలు చేయలేని పరిస్థితి. మరీ దారుణంగా రాష్ట్రంలో అస్సలు లేని బహుజన్ సమాజ్ పార్టీతో 2019 ఎన్నికల్లో జనసేన పొత్తు పెట్టుకోవడమే ఓ పెద్ద విచిత్రం. జనసేన లక్ష్యాలు భారీగా మాటల్లో కనిపిస్తాయి. కానీ, చేతల్లో అడుగులు సరిగ్గా పడటంలేదు. ప్రత్యేక హోదా విషయంలో అయినా జనసేనాని చిత్తశుద్ధితో బీజేపీకి వ్యతిరేకంగా ముందడుగు వేస్తే.. జనసేనకు పొలిటికల్ మైలేజ్ రావడం ఖాయం.