పవన్ కళ్యాణ్, ఎందుకీ రాజకీయ గందరగోళం.?

తెలంగాణ జనసైనికులు చాలా ఉత్సాహంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనసైనికులు, పవన్ కళ్యాణ్ చేయబోయే రాజకీయ దిశా నిర్దేశం కోసం ఈ సమావేశానికి హాజరైన మాట వాస్తవం.

కానీ, పవన్ కళ్యాన్ ఈ సమావేశంలో చెప్పిందేంటి.? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోషించబోయే పాత్ర గురించి ఆయనేమైనా సంకేతాలు పంపారా.? అంటే, ఏమీ లేదు. అసలు తానెందుకు రాజకీయాల్లోకి వచ్చిందీ పదే పదే ఊక దంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఒక్కమాటలో చెప్పాలంటే, పాత ప్రసంగాల తాలూకు వీడియోలు తీస్తే సరిపోయేదానికి, మళ్ళీ కొత్తగా పవన్ మాట్లాడాల్సిన అవసరమేముంది.? ఎక్కడో పవన్ రాజకీయ ప్రసంగాల్లో డొల్లతనం కనిపిస్తోంది. రాజకీయంగా ఆయన చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్‌కి తగదు.

‘ఒక్కడ్నే.. నేనొక్కడ్నే..’ అనే భావన పవన్ కళ్యాణ్‌లో వుండి వుండొచ్చుగాక. కానీ, ఆయన్ని లక్షలాదిమంది అనుసరిస్తున్నారు. ఆ అభిమానులు లేదా జనసైనికుల్ని ప్రతిసారీ నిరాశపర్చడం పవన్ కళ్యాణ్‌కి తగదు. రాను రాను పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాల్లో ‘సోది’ ఎక్కువైపోతోంది. ఇది జనసైనికులకూ ఇబ్బందిగా మారుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టడాన్ని తప్పు పట్టలేం. కానీ, బీజేపీతో కలిసి పని చేస్తున్న దరిమిలా, తెలంగాణలోనూ తమ ఉనికిని చాటుకునేలా జనసేన పార్టీని తీర్చిదిద్దాలి కదా.? ఆశలు, ఆశయాలు, కష్టాల గురించి పవన్ పదే పదే చెప్పి, జనసైనికుల్లో ‘నైరాశ్యం’ నింపేస్తున్నారు.
పోరాట స్ఫూర్తి.. అనే మాటకు అర్థం లేకుండా పోతోంది పవన్ రాజకీయాలు చేస్తున్న తీరు కారణంగా.