జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మాటలు రాజకీయంగా కాక రేపడమే కాదు, సినీ పరిశ్రమలోనూ ప్రకంపనలు సృష్టించిన మాట వాస్తవం. పవన్ అలా ఎందుకు మాట్లాడారు.? అన్నది వేరే చర్చ. పవన్ మాటల ద్వారా సినీ పరిశ్రమ కంగారుపడింది. రాజకీయంగా అలజడి రేగింది.
ఎలాగోలా వివాదం సద్దుమణిగినట్లయ్యింది. మరోపక్క, పవన్ కళ్యాణ్‌ని తమ సినిమా ఫంక్షన్లకు పిలవడానికి నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, వాళ్ళు పిలిచినా వెళ్ళడానికి ఆయన ఒప్పుకోవడం లేదన్న వార్తలూ తెరపైకొచ్చాయి. కానీ, ఏది నిజం.?
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు సినిమా వేడుకల్లో అతి త్వరలో పాల్గొనబోతున్నారు. అయితే, అక్కడ ఆయన ఏం మాట్లాడతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సినీ పరిశ్రమ కోసం తాను మాట్లాడితే, పరిశ్రమలో కొందరు తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నించారనే భావన పవన్‌లో వుంది.
దాంతో, పవన్ కళ్యాణ్‌ని బుజ్జగించేందుకు నిర్మాతలు కొందరు ఆయన్ని ఇప్పటికే కలిశారు. ‘మీరు రాజకీయ పరమైన వివాదాలకు తావిచ్చే వ్యాఖ్యలు చేయొద్దు..’ అని పవన్ కళ్యాణ్‌కి సూచించేంత సీన్ ఎవరికీ లేదు. అది ఆయనిష్టం. ఆయన అలా మాట్లాడితే ఇష్టపడేవారు సినీ పరిశ్రమలోనే చాలామంది వున్నారు.
వాస్తవానికి పవన్, ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళడానికి తనంతట తానుగా మొదటి నుంచీ ఇష్టపడరు. తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోడానికే ఆయన ఆసక్తి చూపరు. కానీ, ఆయన్ని రప్పించేందుకు చాలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ ఏదన్నా సినిమా కార్యక్రమానికి హాజరైతే, ఆ సినిమాకి ఆయన నుంచి వచ్చే పవర్ అంతా ఇంతా కాదు. ఇది సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే.