Pawan Kalyan: యుద్ధం జరగాలని ఎవరు కోరుకోరు…. కాల్పుల విరమణ వేళ పవన్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి స్పందిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా ఈ యుద్ధాన్ని విరమించారు. ఇక ఈ విషయాన్ని భారత్ అధికారిక ప్రకటన చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ స్పందించారు.

విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో సర్వమత సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, మతపెద్దలు హాజరయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మతం కంటే మానవత్వమే ముఖ్యమని ఆయన తెలిపారు. పహల్గాం ఘటన దేశాన్ని కలిచి వేసిందని తెలిపారు.

దేశం సహనానికి మారుపేరని ఆయన తెలిపారు. అన్ని ధర్మాలు, మతాలు విలసిల్లాలని అందరూ కోరుకుంటామన్నారు. రాజ్యాంగం రాక ముందు నుంచే ఈ సంస్కృతి ఉందన్నారు. ఉగ్రవాదం ఎప్పుడూ మన వెంటే ఉన్న ప్రమాదం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలో చూసిన నేల ఇది అని పవన్ తెలిపారు. మన కుల మతాలు వేరైనా మనమంతా కూడా భారతీయులం అనే ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు.

ఎంతో గొప్పదైన ఈ భారతదేశాన్ని విడగొడదామని కల్లోలాలు సృష్టించడం కోసం కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తుంటాయని కానీ వాటిని మనం ఐకమత్యంతో తరిమి కొట్టాలని తెలిపారు.యుద్ధం కావాలని, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోరని, కానీ తప్పనిసరి అయ్యే యుద్ద పరిస్ధితులు వచ్చాయన్నారు. ఇదంతా ముగిసిపోవాలని, ఆ శుభవార్త కూడా త్వరలో వింటామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.