Pawan Kalyan Remuneration : పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సరిపోతుందా.?

Pawan Kalyan Remuneration : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా తయారవుతున్నాయి. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా వివాదంలోకి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరుని తీసుకొచ్చారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ‘వకీల్ సాబ్’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత.? అని మంత్రి అనిల్ ప్రశ్నించడమే కాదు, రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా నిర్మాణ వ్యయం తగ్గుతుందనీ, తద్వారా సినిమా టిక్కెట్ల ధరలు తక్కువున్నా నిర్మాతకు ఇబ్బంది వుండదనీ మంత్రి చెప్పుకొచ్చారు.

తనకు తెలిసిన నాని.. కొడాలి నాని మాత్రమేనని మంత్రి అనిల్ ఎద్దేవా చేయడం గమనార్హమిక్కడ. వాస్తవానికి, ఏ హీరో రెమ్యునరేషన్ ఎంత.? అనేది ఏ రాజకీయ పార్టీగానీ, ఏ ప్రభుత్వంగానీ నిర్ణయించే పరిస్థితి వుండదు. అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించగలదా.? పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ విషయంలో అయినా అంతే.

సినిమాకి ఎంత ఖర్చుపెట్టాలన్నది నిర్మాత ఇష్టం. ఆ కథకు అవసరమైనంత మేర నిర్మాత ఖర్చు చేస్తాడు. సినిమా సక్సెస్ అవుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. తెలుగు సినిమా స్థాయి పెరిగింది.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకుంటోంది గనుక, ఆయా సినిమాలకు ఖర్చు పెరుగుతోంది.. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు వెసులుబాట్లు కనిపిస్తే, మరింతగా తెలుగు సినిమా.. ఇండియన్ సినిమా ఎదుగుతుంది.

సరే, బ్లాక్ టిక్కెట్ల వల్ల ప్రేక్షకులు నష్టపోతున్నమాట వాస్తవం. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. థియేటర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టాల్సిందే. కానీ, ఇలా రెమ్యునరేషన్ల గురించి, సినిమా బడ్జెట్ల గురించి మంత్రులు మాట్లాడిదే అది హాస్యాస్పదమే అవుతుంది. స్టార్ హోటల్‌లో ఇడ్లీ ఖరీదు, రోడ్డు పక్కన కాకా హోటల్‌లో ఇడ్లీ ఖరీదూ ఒకేలా వుండదు కదా.? ఆ ధరల్ని ప్రభుత్వం నియంత్రించలేదు కదా.?