Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబంధించిన షూటింగ్ పనులలో పాల్గొంటున్నారు ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను పూర్తి చేశారు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఇలా ఒక వైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరొక నటుడు కమల్ హాసన్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇటీవల కమల్ హాసన్ అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కమిటీలో చోటు సంపాదించుకున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించి ది అకాడమీ ఆఫ్ ది మోషన్స్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జాబితాలో కమల్ హాసన్ కి చోటు దక్కింది.
ఈ క్రమంలోనే నటుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ కు అభినందనలు తెలిపారు.”కమల్ హాసన్ గారి ప్రతిభ అనుభవం సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. ఆయనకు ఈ గౌరవం దక్కినందుకు అభినందిస్తున్నాను. సినీ ప్రపంచానికి ఆయన మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ఆస్కార్ కమిటీలో చోటు దక్కడం అంటే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల జాబితాలో నిలిచిన సినిమాలకు ఓటు వేసే హక్కును పొందారని చెప్పాలి. ఈ జాబితాలో తెలుగు హీరోలైన రామ్ చరణ్ ఎన్టీఆర్, అలాగే సూర్య కూడా గతంలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.