పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సినిమాలే మిస్ చేసుకున్నారు. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలయ్యాయి కూడ. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే పవన్ ఆసక్తి చూపకపోవడంతో అసలు మెటీరియలైజ్ కాలేదు కూడ. వాటిలో ‘ది డైరీ ఆఫ్ మిసెస్ శారద’ కూడ ఒకటి. ఇది ఒక ప్రముఖ తెలుగు నవల. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాశారు. విజయవంతమైన ఆయన నవలల్లో ఇది కూడ ఒకటి. 80ల దశకంలో యండమూరి రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. వాటిలో ఎక్కువ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి చేసినవే.
‘అభిలాష, మరణమృదంగం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, రుద్రనేత్ర, ఛాలెంజ్. దొంగ మొగుడు, రక్తసింధూరం’ లాంటి సినిమాలు యండమూరి రాసిన కథలతో తెరకెక్కినవే. అందుకే ఆయన నవలల్లో ఒకటైన ‘ది డైరీ ఆఫ్ మిసెస్ శారద’ను పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించడానికి కొందరు చాలా ట్రై చేశారు. పవన్ విముఖత వల్లనో లేకపోతే వేరే కారణాల మూలంగానే స్పష్టత లేదు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ కథ నవలాగానే ఉండిపోయింది. మరెవరూ కూడ దాన్ని సినిమాగా తీసే ప్రయత్నం చేయలేదు.