Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సినీ నటుడిగా కోట్లాదిమంది అభిమానులున్నారు.. రాజకీయ నాయకుడిగా లక్షల్లో జనసైనికులున్నారు. అభిమానులందరూ జనసైనికులుగా మారి వుంటే, ఆయన కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిచి వుండేవారే. ఆ సంగతి పక్కన పెడితే, జనసైనికులు చాలా చిత్తశుద్ధితో తమ అభిమాన నాయకుడ్ని, కీలక పదవుల్లో చూడాలనుకుంటున్నారు.. అందు కోసం పార్టీ తరఫున గట్టిగా నిలబడుతున్నారు.
కానీ, పవన్ కళ్యాణ్ చేస్తున్నదేంటి.? విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యక్రమంలో జనసేన అధినేత దీక్ష చేశారు. ఈ దీక్ష వెనుక పవన్ ఉద్దేశ్యం ఏంటి.? అన్నది జనసైనికులకు సైతం అర్థం కాలేదు. దీక్ష చేయాల్సి వస్తే, అది విశాఖ వేదికగా చేసి వుండాలి. కానీ, పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు జనసేన అధినేత.
సరే, నిరసన రూపాల్లో బోల్డన్ని రకాలున్నాయి.. జనసేనాని ఈ పంథా ఎంచుకున్నారని సరిపెట్టుకుందామన్నా, సరిపెట్టుకోలేని పరిస్థితి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే, పవన్ దీక్షలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.
కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ మిత్రపక్షం. సో, జనసేనాని ఆందోళనలు చేయడంలో అర్థమే లేదు. ఎవర్ని ప్రశ్నిస్తున్నదీ తనకే స్పష్టత లేనప్పుడు, జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు.?
ఇలాంటి గందరగోళ రాజకీయాలతో, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం నడపలేరు. కానీ, నడిపేస్తున్నారంటే కారణం.. పవన్ కళ్యాణ్ అభిమానులైన జనసైనికులే. పవన్ సినిమాల్లో బిజీగా వున్నారు, అడపా దడపా రాజకీయ తెరపై ఇదిగో ఇలాంటి గెస్ట్ రోల్స్ చేస్తున్నారంతే.