జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దాదాపు నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడగా, ఆయన పూర్తిగా కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఆహార నియమాల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధగా వుంటారు. అయినా, ఆయన్ని కరోనా ఇంతలా ఎక్కువ రోజులపాటు ఇబ్బంది పెట్టడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ, సినీ పరిశ్రమలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, పవన్ కళ్యాణ్, కరోనా నుంచి కోలుకున్నారంటూ.. ఆయన కరోనా బారిన పడ్డ మూడు నాలుగు రోజులకే గాసిప్స్ వచ్చాయి.
ఓ పది పది హేను రోజుల క్రితం కూడా పవన్ కోలుకున్నారనీ, అయినప్పటికీ విశ్రాంతి నిమితం కొన్ని రోజులపాటు బయటకు వచ్చే అవకాశం లేదనీ వార్తలొచ్చాయి. తాజాగా, జనసేన పార్టీ అధికారికంగా పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. 8వ తేదీన.. అంటే, నేడే ఈ బులెటిన్ విడుదలైంది. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఆర్.టి. పిసిఆర్ పరీక్ష ద్వారా పవన్ కళ్యాణ్ కరోనా నెగెటివ్ అని తేలిందని జనసేన పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డంపై వైసీపీ నేతలు కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు గతంలో. ఆయనకు సోకింది కరోనా వైరస్సా.? లేదంటే, కరెన్సీ వైరస్సా.? అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తీవ్ర విమర్శలు చేయగా, ఆయనపై జనసేన శ్రేణులు అంతకన్నా తీవ్రంగా మండిపడ్డాయి. సదరు వైసీపీ ఎమ్మెల్యే కూడా గతంలో కరోనా బారిన పడ్డారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోయాయి. కేవలం మూడు రోజులకే పవన్, కరోనా నుంచి ఎలా కోలుకున్నారంటూ వైసీపీ నేతలు కొందరు (కరోనా బాధని అనుభవించినవాళ్ళే) విమర్శలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఇదిలా వుంటే, పవన్ కొన్నాళ్ళపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారనీ, ఆ తర్వాతే తిరిగి సినిమాలు, రాజకీయ వ్యవహారాలపై ఫోకస్ పెడతారనీ జనసేన వర్గాలు అంటున్నాయి.