రాజధాని అమరావతిపై కన్నేసిన జనసేనాని.?

2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఏంటి.? అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయ్. ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడిపోవడం ఖాయమని వైసీపీ జోస్యం చెబుతోన్న విషయం విదితమే.

జనసేన అధినేత 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి, ఆ రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి గాజువాక, ఇంకోటి భీమవరం.. ఈ రెండిట్లో జనం పవన్ కళ్యాణ్‌ని లైట్ తీసుకున్నారు. అయితే, అక్కడ టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయని జనసేన ఆరోపించడం మామూలే.!

ఇదిలా వుంటే, తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేస్తారనీ, కాకినాడపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారనీ, మళ్ళీ భీమవరం నుంచే జనసేనాని పోటీ చేస్తారనీ.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, మరో కొత్త నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించిన గాసిప్స్ లిస్టులో చేరిపోయింది.

రాజధాని అమరావతి పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్నది ఆ తాజా గాసిప్స్ సారాంశం. అమరావతి పరిధి అంటే.. అటు గుంటూరు, ఇటు బెజావాడ కూడా కలుపుకునేనట. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధానికి కాస్త దగ్గరలో, రాజధాని ప్రభావం వున్న నియోజకవర్గంలో జనసేనాని పోటీ చేస్తే బావుంటుందన్న ప్రతిపాదన ఆయా జిల్లాల్లోని జనసైనికుల నుంచి వస్తోందట.

మరీ ముఖ్యంగా వంగవీటి రంగా ప్రభావం ఎక్కువగా వుండే నియోజకవర్గమైతే పవన్ కళ్యాణ్‌కి కరెక్టుగా వుంటుందని అంటున్నారు. ఏమో, ఈ గాసిప్‌లో నిజమెంతోగానీ.. జనసేన అధినేత తరచూ రంగా పేరు వస్తుండడం వెనుక కారణం అదే అయి వుండొచ్చేమో.!